టీటీడీ ఈవోగా రెండోసారి అవకాశం రావడంతో తనకు మరింత బాధ్యత పెరిగిందని శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ అన్నారు.
టీటీడీ ఈవోగా బుధవారం తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ పూర్వపు ఈవో శ్రీ శ్యామలరావు నుండి ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన శ్రీవారి ఆలయంలో టీటీడీ బోర్డు మెంబెర్ సెక్రటరీ ఎక్స్ ఆఫీసియో గా కూడా ప్రమాణం చేశారు. వీరితో టీటీడీ అదనపు ఈఓ శ్రీ వెంకయ్య చౌదరి ప్రమాణం చేయించారు.
స్వామివారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు నూతన ఈఓ కు వేదాశీర్వచనం చేశారు. ఆ తర్వాత అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి ఈవోకు శ్రీవారి ప్రసాదాలు, చిత్రపటం అందజేశారు.
అనంతరం ఈవో ఆలయం ముందు మీడియాతో మాట్లాడుతూ టీటీడీ ఈవోగా రెండోసారి బాధ్యతలు స్వీకరించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాన్నారు. ఈ అవకాశాన్ని కల్పించినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలియజేశారు.
మొదటిసారి మే 2017 నుంచి అక్టోబర్ 2020 వరకు – మూడు సంవత్సరాలు నాలుగు నెలలు సేవలందించే అవకాశం వచ్చిందని చెప్పారు. గత సంవత్సరం నుండి లడ్డు, అన్నప్రసాదాల క్వాలిటీ మెరుగుపడటంతో భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని చెప్పారు.