Sabarimala : శబరిమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్

Update: 2025-03-11 13:45 GMT

శబరిమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్. అక్కడి అయ్యప్ప గుడిలోని సన్నిధానంలో 18 మెట్లను ఎక్కగానే స్వామి దర్శనం అయ్యేలా మార్పులు చేయాలని దేవస్థానం నిర్ణయించింది. ఈ నెల 15 నుంచి 12 రోజుల పాటు దీన్ని ప్రయోగాత్మకంగా అమలు చేసి, విజయవంతమైతే రానున్న మండల మకరవిళక్కు సీజన్ నుంచి కొనసాగిస్తామంది. సాధారణంగా మెట్లు ఎక్కగానే భక్తులను ఓ వంతెన మీదికి మళ్లించి కొంత సమయం క్యూలో ఉంచిన తర్వాతే దర్శనానికి అనుమతిస్తారు.

సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ వివరాలను టీడీబీ అధ్యక్షుడు పి.ఎస్.ప్రశాంత్ వెల్లడించారు. ఈ మార్పును తొలి విడతలో మార్చి 15 నుంచి ప్రయోగాత్మకంగా అమలు చేస్తామన్నారు. ఈ వ్యవధిలో మాసిక పూజలు, 12 రోజుల విష్ణు పూజల సందర్భంగా కొత్త మార్గంలో భక్తులకు స్వామివారి దర్శన అవకాశాన్ని కల్పిస్తామని ఆయన తెలిపారు.

''ఈ పద్ధతి విజయవంతమైతే, ఇకపై కొత్త మార్గంలోనే స్వామి వారి దర్శనానికి భక్తులను పంపుతాం. వచ్చే మండలం-మకర విలక్కు సీజన్‌లోనూ అంతే. ఈ మార్పు చేయాలంటూ మాకు భక్తుల నుంచి వేలాదిగా లేఖలు వచ్చాయి'' అని పి.ఎస్.ప్రశాంత్ చెప్పారు. అయ్యప్ప ఆలయ ప్రధాన పూజారి (తంత్రి), ఇతర పండితుల సలహాలు తీసుకున్న తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. కొత్త మార్గంలో అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి ఒక్కో భక్తుడికి సగటున 20 నుంచి 25 సెకన్ల సమయం పడుతుందన్నారు.

Tags:    

Similar News