Tirupati : వైభవంగా శ్రీ కోదండరామస్వామి పవిత్రోత్సవాలు ప్రారంభం

Update: 2025-07-21 08:00 GMT

తిరుపతి శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో ఆదివారం పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఉదయం 11 గంటలకు శ్రీ సీతారామ సమేత లక్ష్మణ స్వామివారి ఉత్సవమూర్తులను విమాన ప్రదక్షిణగా యాగశాలకు వేంచేపు చేశారు. అక్కడ స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు, కొబ్బరినీళ్లతో స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులకు అభిషేకం చేశారు. అనంతరం శాత్తుమొర, ఆస్థానం నిర్వహించారు. సాయంత్రం 5.30 గంటలకు శ్రీ సీతారామ లక్ష్మణులు బంగారు తిరుచ్చిపై ఆలయ మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. రాత్రి పవిత్ర ప్రతిష్ట, శయనాధివాసం తదితర కార్యక్రమాలు చేపడతారు. తిరుపతికి చెందిన శ్రీ పురుషోత్తం ఆలయ ఉత్సవమూర్తులకు 4 ముత్యాల కిరీటాలను విరాళంగా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, ఏఈవో శ్రీ రవి ఆలయ అర్చకులు పాల్గొన్నారు.

Tags:    

Similar News