Varahalakshmi Temple : వరాహలక్ష్మీ దేవాలయంలో ఘనంగా వైకుంఠ వాసుని ఉత్సవం
ఉత్తరాంధ్ర జిల్లాల ఆరాధ్యదైవం శ్రీ వరాహలక్ష్మీ నృసింహ స్వామివారి దేవాలయంలో వైకుంఠ వాసుని ఉత్సవం ఘనంగా జరిగింది స్వామివారి ఉత్తర భాగాన శ్రీదేవి భూదేవి సమేతుడై వైకుంఠవాసుని గా వెలిసిన విగ్రహాల వద్ద పాయసాన్ని వరదలా పోశారు . దీనివలన దేశ ప్రజలు సుభిక్షంగా ఉంటారని , కరువుకాటకాలు రాకుండా వర్షాలు విస్తారంగా కురుస్తాయని ఆలయ సంప్రదాయం ,ఆచారం .. ముందుగా వైకుంఠవాసుని మెట్ట వద్ద స్వామీ అమ్మవార్లకు విశ్వక్షేణ ఆరాధన , వరుణ జపం , వరుణసూక్తం పారాయణాలు జరిపారు . అనంతరం స్వామివారి విగ్రహాలకు పంచామృతాలతో విశేష అభిషేకాలు జరిపారు . అనంతరం భక్తులకు పాయసం , పులిహోర , పొంగలి ప్రసాదాలను ,తీర్ధాన్ని అందించారు . ఈ వరదపాయస ఉత్సవం ఆలయ ప్రధాన అర్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు , సీతారామాచార్యులు , స్థానాచార్యులు గోపాలాచార్యులు పర్యవేక్షణలో జరిగింది , భారీగా భక్తులు , ఈవో త్రినాధరావు దంపతులు పాల్గొన్నారు.