తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న స్వామివారిని 69,029 మంది భక్తులు దర్శించుకోగా 28,547 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. అదే సమయంలో హుండీ ఆదాయం రూ.2.90 కోట్లు సమకూరింది.
తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన అక్టోబరు నెల కోటాను జూలై 18న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఈ సేవాటికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం జూలై 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన వారు జూలై 20 నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీడిప్‌లో టికెట్లు మంజూరవుతాయి. కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లను జూలై 22వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.
జూలై 27న శ్రీవారి సేవ కోటా విడుదల
జూలై 27న తిరుమల – తిరుపతి శ్రీవారి సేవ కోటా ఉదయం 11 గంటలకు, నవనీత సేవ మధ్యాహ్నం 12 గంటలకు, పరకామణి సేవ మధ్యాహ్నం 1 గంటకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు.
అక్టోబర్ 4 నుండి 12వ తేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో …
అక్టోబర్ 4 నుండి 10వ తేదీ వరకు సుప్రభాత సేవ మినహా, మిగిలిన అన్ని ఆర్జిత సేవలు రద్దు.
అక్టోబర్ 11, 12వ తేదీల్లో సుప్రభాత సేవతో పాటు అన్ని ఆర్జిత సేవలు రద్దు.
అక్టోబర్ 3 నుండి 13వ తేదీ వరకు అంగప్రదక్షిణ, వర్చువల్ సేవా దర్శనం టికెట్లు రద్దు చేయబడింది. కావున భక్తులు ఈ విషయాన్ని గమనించి టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.