ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ సన్నిధిలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మూడో రోజు దుర్గమ్మ... శ్రీ అన్నపూర్ణా దేవి అలంకారంలో దర్శనమిస్తున్నారు. ఆశ్వయుజ మాసం ఆరంభంలో నిర్వహించే శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా జగన్మాతను వివిధ అలంకారాల్లో ఆరాధిస్తారు. ఇంద్రకీలాద్రిపై నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గమ్మ రోజుకో అలంకారంలో దర్శనమిస్తుంది. మొదటి రోజు బాలా త్రిపుర సుందరి, రెండో రోజు వేదమాత గాయత్రిగా అనుగ్రహించిన అమ్మవారు మూడో రోజు బుధవారం అన్నపూర్ణ దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు.
సకల జీవరాశికి ఆహారం ప్రసాదించే అన్నపూర్ణ దేవిని దర్శించుకుంటే ఆకలిదప్పులుండవు. ప్రాణకోటికి జీవనాధారం అన్నం...అందుకే అన్నాన్ని పరబ్రహ్మస్వరూపం అంటారు. సాక్షాత్తు పరమేశ్వరుడికే భిక్షపెట్టిన అన్నపూర్ణాదేవిని ధ్యానిస్తే ధనధాన్యవృద్ధి, ఐశ్వర్య సిద్ధి కలుగుతుంది. లోకంలో జీవుల ఆకలిని తీర్చటం కన్నా మించినది ఇంకేమీ లేదన్నదే ఈ అలంకారం వెనుకున్న ఆంతర్యం.
ఈ రోజు అన్నపూర్ణ దేవికి గంధం లేదా పసుపు రంగు వస్త్రాన్ని సమర్పిస్తారు. ఈ రంగులు ఇచ్చేందుకు ప్రతీక. ఈ రోజు అమ్మవారికి గారెలు, క్షీరాన్నం, దధ్యోజనం నివేదిస్తారు. ఈ రూపంలో ఉన్న శక్తి రూపాన్ని అర్చిస్తే బుద్ధివికాసం, సమయస్ఫూర్తి, బుద్ధి కుశలత కలుగుతాయి.
బిడ్డల ఆకలి తీర్చేందుకు ఆదిపరాశక్తి స్వయంగా అన్నపూర్ణాదేవిగా తరలిరావడమే ఈ అలంకారం వెనుకున్న ఆంతర్యం. అన్నపూర్ణ దేవిని తెలుపు, పసుపు పూలతో పూజించాలి. ఈ రోజు అన్నపూర్ణాదేవి స్తోత్రాలతో పాటు ఆదిశంకరాచార్యులు రచించిన సౌందర్యలహరి కూడా చదువుకుంటే శుభఫలితాలు పొందుతారని పురాణేతిహాసాల ద్వారా మనం తెలుసుకోవచ్చు. అమ్మవారి అవతారాల్లో అన్నపూర్ణాదేవి రూపం విశిష్టమైనది. ఎడమ చేతిలో బంగారు పాత్రతో...తన భర్త అయిన ఈశ్వరునికి భిక్షను అందించే రూపంలో కనిపించే అన్నపూర్ణను దర్శించుకుంటే ఆకలి బాధలు ఉండవని భక్తుల విశ్వాసం.
ఎడమ చేతిలో ఉన్న బంగారు పాత్రలో ఉన్న అమృతాన్నం, వజ్రాలు పొదిగిన గరిటతో సాక్షాత్తుగా ఈశ్వరునికే భిక్షను అందిస్తుంది అన్నపూర్ణమ్మ. ఈ తల్లిని ధ్యానిస్తే ధనధాన్యవృద్ధి, ఐశ్వర్య సిద్ధి కలుగుతాయి. అమ్మవారు ధరించిన అక్షయపాత్ర సకల శుభాలను అందిస్తుంది. బిడ్డల ఆకలి తీర్చడానికి ఆదిపరాశక్తి స్వయంగా అన్నపూర్ణాదేవిగా రావడం ఈ అవతార విశేషం. లోకంలో జీవుల ఆకలిని తీర్చటం కన్నా మించినది ఏది లేదన్నదే ఈ అలంకారం వెనుకున్న పరమార్థం. నిత్యాన్నదానేశ్వరి అలంకారంలో దుర్గమ్మని దర్శించుకుంటే అన్నాదులకు లోటు ఉండదని చెబుతారు. దశవిధాలైన పాపాలను హరించేది కనుకే ‘దశహరా’ ఇదే దసరాగా వాడుకలోకి వచ్చింది. దుష్టసంహారం ద్వారా ధర్మాన్ని నిలపడమే శరన్నవరాత్రి మహోత్సవాల్లో పరమార్థం.