చార్‌ధామ్ యాత్రలో ముఖ్యమైన కేదార్‌నాథ్ పుణ్యక్షేత్రాన్ని మే 2న తెరవనున్నట్లు బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ అధికార ప్రతినిధి తెలిపారు. అలాగే, మే 4న బద్రీనాథ్ ఆలయాన్ని ఓపెన్ చేస్తామన్నారు. వీటితో పాటు రెండో కేదార్‌గా పిలవబడే మద్‌మహేశ్వర ఆలయాన్ని మే 21న, మూడో కేదార్ తుంగ గుడిని మే 2న తెరుస్తామని వివరించారు. విపరీతమైన మంచు వల్ల వేసవిలో కొన్ని రోజుల పాటే ఈ ఆలయాలు తెరిచి ఉంటాయి.
పరమేశ్వరుడి పవిత్ర ఆలయాలైన 12 జ్యోతిర్లింగాల్లో కేదార్‌నాథ్, బద్రీనాథ్ ఆలయాలు కూడా ఉన్నాయి. చార్‌ధామ్ యాత్రలో ఈ దేవాలయాలు సందర్శన భాగంగా ఉంటాయి. ఏటా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షల మంది భక్తులు కేదార్‌నాథ్, బద్రీనాథ్ ఆలయాలను సందర్శించి పరమేశ్వరుడ్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తుంటారు. అయితే ఏటా శీతాకాలం ప్రారంభం కాగానే ఈ ఆలయాలను మూసివేస్తారు. ఆ సమయంలో ఆలయాలు మొత్తం మంచుతో కప్పుకుపోయి ఉంటాయి. తిరిగి వేసవిలో ఈ ఆలయాల తలుపులు తెరుస్తారు. ఇక చార్‌ధామ్ యాత్ర ఈ నెల 30 నుంచి ప్రారంభమవుతుంది. భక్తులు యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్‌లను సందర్శిస్తారు. ఈ యాత్ర నేపథ్యంలో గంగోత్రి, యమునోత్రి ఆలయాలను ఈ నెల 30 నుంచి తెరవనున్నారు.