తెలుగు రాష్ట్రాల్లో ప్రాచుర్యం పొందిన ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో భక్తుల తాకిడి మొదలైంది. మహా శివరాత్రిని పురస్కరించుకొని తె.జా 2.30 గంటల నుంచి అధికారులు దర్శనాలకు అనుమతిస్తున్నారు. దీంతో పవిత్రమైన రోజున పరమశివుడిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున క్యూలైన్లలో వేచి ఉన్నారు. సాయంత్రం స్వామి, అమ్మవార్లకు ప్రభోత్సవం, రాత్రి నంది వాహన సేవ, మల్లికార్జునుడి బ్రహ్మోత్సవ కళ్యాణం నిర్వహిస్తారు.
శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇవాళ ఉదయం చండీశ్వరపూజ, మండపారాధన, కలశార్చన, శివపంచాక్షరీ, జపానుష్టానాలు, రుద్రపారాయణలు, రుద్రహోమం, చండీహోమం జరిపించారు. సాయంత్రం భ్రమరాంబ అమ్మవారితో కలిసి మల్లికార్జున స్వామి గజవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. రేపు శివరాత్రి నేపథ్యంలో లక్షలాది మంది భక్తులు అక్కడికి చేరుకుంటున్నారు.