తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం విఐపి విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల కొండా సురేఖ మాట్లాడుతూ నా జన్మదినాన్ని పురస్కరించుకుని కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి సేవలో పాల్గొనటం సంతోషంగా ఉందన్నారు. మరోవైపు నవంబర్ నెలలో జరిగే సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టాదళ పాదపద్మారాధన లాంటి ఆర్జిత సేవా టికెట్లను ఈరోజు (ఆగస్టు 19) ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. నేటి ఉదయం 6:00-7:00 గంటల మధ్య అష్టదళ పాద పద్మారాధన సేవ, సహస్రనామ అర్చన సేవ, ఆ తర్వాత 7:00 గంటల నుండి సాయంత్రం 7:00 గంటల వరకు సాధారణ దర్శనం కొనసాగుతుంది. అలాగే మధ్యాహ్నం 12:00 నుండి సాయంత్రం 5:00 గంటల వరకు కల్యాణోత్సవం, బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, ఊంజల్ సేవలు ఉంటాయి. సాయంత్రం 5:30 నుండి 6:30 వరకు సహస్ర దీపాలంకరణ సేవ ఉంటుంది. శ్రీవారి దర్శన టికెట్ల కోసం క్యూ లైన్లలో భక్తులు ఎదురుచూస్తున్నారు. భక్తుల రద్దీని బట్టి దర్శనానికి పట్టే సమయం మారుతుంది.