కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానానికి ఈనెల రికార్డు స్థాయిలో 1 కోటి 45 లక్షల రూపాయలు హుండీ ఆదాయం లభించింది. అయితే దేవస్థానం అధికారులు ఎంతగా అవగాహన కల్పిస్తున్నప్పటికీ కొందరు భక్తులు హుండీలలో పువ్వులు, తులసి ఆకులు వేయడంతో చాలా కరెన్సీ నోట్లు పాడైపోయాయి. గురువారం ఉదయం దేవస్థానం కార్యనిర్వహణాధికారి, డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధరరావు ఆధ్వర్యంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం హుండీలను తెరిచి లెక్కింపు ప్రారంభించారు. 28 రోజులకు శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ప్రధాన హుండీలు, ఆలయ ప్రాంగణంలో ఉన్న శ్రీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయ హుండీల నుంచి రూ.1,22,85,766, అన్న ప్రసాద హుండీల నుంచి రూ.22,30,833 వెరసి రూ.1,45,16,599 ఆదాయం వచ్చిందని డీసీ చక్రధరరావు తెలిపారు. అలాగే 37 గ్రాముల బంగారం, 890 గ్రాముల వెండి, పలు విదేశాల కరెన్సీ నోట్లు వచ్చాయని చెప్పారు. భక్తులు హుండీలలో నగదు, నాణేలు మాత్రమే వేయాలని, పువ్వులు, ఆకులు వేయవద్దని ఆయన కోరారు.