Sharanavaratri : అంగరంగ వైభవంగా శరన్నవరాత్రి వేడుకలు

Update: 2025-09-22 06:27 GMT

బెజవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో దేవి శరన్నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీ విశ్వవసు నామ సంవత్సరం ఆశ్విజ శుద్ధ పాడ్యమి సోమవారం దేవీ నవరాత్రి ఉత్సవాల్లో తొలిరోజున అమ్మవారు శ్రీ బాలా త్రిపురసుందరి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు.. తొలి రోజు అమ్మవారికి స్నపనాభిషేకం అనంతరం 8 గంటలకు దర్శనాన్ని అందించారు. ఇంద్రకీలాద్రి పై నవరాత్రులలో మొదటి రోజు దర్శనమిస్తున్న బాలా త్రిపురసుందరీ దేవి అలంకరణకు ఎంతో విశిష్టత ఉంది. సమస్త దేవి మంత్రాలలో కంటే బాలా మంత్రం ఎంతో గొప్పదని.. విద్యోపాసకులకి మొట్టమొదట బాలా మంత్రాన్ని ఉపదేశిస్తారు. మహాత్రిపుర సుందరీ దేవి నిత్యం కొలువుండే శ్రీ చక్రంలో మొదటి ఆమ్నాయంలో ఉండే మొదటి దేవత బాలాదేవి. ముందుగా బాలాదేవి అనుగ్రహం పొందితేనే మహాత్రిపుర సుందరీ దేవి అనుగ్రహాన్ని పొందగలుగుతారని పురాణాలు చెపుతున్నాయి. దసరా మహోత్సవాలలో భక్తులకు పూర్ణఫలం అందించే అలంకారం శ్రీబాలాదేవి అని ప్రతీతి.

కాగా, విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభం అయ్యాయి.. సెప్టెంబర్ 22 నుంచి అంటే నేటి నుంచి అక్టోబర్ 2 వరకు 11 రోజుల పాటు శరన్నవరాత్రులు జరగనున్నాయి.. అమ్మవారు నేడు బాలా త్రిపుర సుందరీ దేవీ అలంకారంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు అమ్మవారు.. ఈ సారి ప్రత్యేకంగా కాత్యాయనీ దేవి అవతారంలో అమ్మవారి దర్శనం ఇవ్వనున్నారు.. ఈ ఏడాది అమ్మవారి దర్శనానికి ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాలు, పొరుగు రాష్ట్రాల నుంచి 20 లక్షల మందికి పైగా భక్తులు రానున్నారని అంచనా వేస్తున్నారు అధికారులు.. శ్రీ శక్తి పథకం ఉచిత బస్సులతో మహిళా భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉందంటున్నారు.. ఇక, వీఐపీ - వీవీఐపీ దర్శన సమయాలు ఉదయం 7 నుంచి 9 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్ణయించారు అధికారులు.

ఓవైపు అసెంబ్లీ సమావేశాలు, దసరా ఉత్సవాలు కలిసి రావడంతో వీఐపీల రద్దీ పెరిగే అవకాశం ఉంది.. సామాన్య భక్తులకు పెద్దపీట వేసేలా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.. రూ.500 టికెట్లు రద్దు చేశారు.. రూ.300, రూ.100 టికెట్లు మాత్రమే అందుబాటులో ఉంచారు.. వృద్ధులు, వికలాంగులు, గర్భిణీలకు ప్రత్యేక దర్శనం సాయంత్రం 4 గంటలకు కల్పించేలా ఏర్పాట్లు చేశారు.. అన్నదానం, ప్రసాదం పంపిణీ నిత్యం కొనసాగనుంది.. ఇక, క్లూలైన్లో నీటి బాటిల్స్, మజ్జిగ పాకెట్లు, బిస్కెట్లు పంపిణీ చేస్తారు.. 5000 మంది పోలీసులతో పటిష్ట బందోబస్త్ ఏర్పాటు చేశారు.. 500 సీసీ కెమెరాలు, 25 డ్రోన్లతో ఉత్సవాల పర్యవేక్షణ జరుగుతోంది.. దూర ప్రాంతాల భక్తుల కోసం 12 చోట్ల పార్కింగ్ సదుపాయం ఏర్పాటు చేశారు అధికారులు.

Tags:    

Similar News