శ్రీవారి బ్రహ్మోత్సవాలు కన్నులపండువగా నిర్వహించేందుకు అధికారులు సమిష్టిగా పనిచేయాలని టిటిడి ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 2వ తేది వరకు జరుగునున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలపై గురువారం సాయంత్రం తిరుమలలోని అన్నమయ్య భవన్ లో శాఖలవారీగా ఈవో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా బ్రహ్మోత్సవాలకు చేపట్టిన ఏర్పాట్లను వివరించారు.
ఈవో మాట్లాడుతూ, పారిశుద్ధ్యానికి పెద్ద పీట వేయాలని ఆయన వెల్లడించారు. బ్రహ్మోత్సవాల సమయంలో మాడ వీధులను పరిశుభ్రంగా ఉంచేందుకు అదనంగా అవసరమైనంత సిబ్బందిని తీసుకోవాలని ఆదేశించారు. గరుడ వాహనం రోజున సీనియర్ అధికారులకు మాడవీధుల్లో విధులు కేటాయించి భక్తుల నుండి ఎప్పటికప్పుడు అభిప్రాయాలను సేకరించాలన్నారు. గ్యాలరీలల్లోని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్నప్రసాదాలు పంపిణీ చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ ఏర్పాటు చేయాలన్నారు. బ్రహ్మోత్సవాల్లో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తిరుమలలో అవసరమైన మేరకు వాహనాల కోసం పటిష్ట పార్కింగ్ సదుపాయం కల్పించాలన్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా తిరుపతిలో కూడా ప్రత్యేక పార్కింగ్ లు ఏర్పాటు చేయాలన్నారు. నాదనీరాజనం వేదికపై పేరొందిన కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు.