శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా గరుడవాహన సేవ అంగరంగ వైభవంగా సాగింది. కనివినీ ఎరుగని రీతిలో కన్నుల పండువగా వైకుంఠనాధునికి సాగిన గరుడ వాహన సేవ తిలకించేందుకు భక్తజనం సంద్రమై పోటెత్తింది. వాహన సేవ వీక్షించేందుకు వచ్చిన సుమారు 3 లక్షల మంది భక్తులకు తితిదే సకల సౌకర్యాలు కల్పించింది. సామాన్య భక్తులకు స్వామి వారి వైభవ సాక్షాత్కారమే ప్రథమ ప్రాధాన్యంగా... కలియుగాధిపతికి గరుడ వాహన సేవను టీటీడీ ఘనంగా నిర్వహించింది.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ సాయంత్రం 4 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామి స్వర్ణ రథంపై భక్తులను అనుగ్రహిస్తారు. ఈ రథం స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైనదని ప్రతీతి. 32 అడుగుల ఎత్తు, 30 టన్నుల బరువు ఈ రథం ఉంటుంది. 18 ఇంచుల మందంతో కూడిన 2,900 కేజీల రాగిపై 74 కేజీల మేలిమి బంగారంతో తాపడం చేశారు. ఈ రథాన్ని లాగి తరించేందుకు భక్తులు పోటీ పడతారు. ఇక రాత్రి 7 గంటలకు శ్రీవారికి గజవాహన సేవ ఉంటుంది.