TTD : జూలై 20 నుండి 22వ తేదీ వరకు శ్రీ కోదండ రామస్వామి వారి పవిత్రోత్సవాలు
తిరుపతి శ్రీ కోదండరామస్వామి వారి ఆలయ పవిత్రోత్సవాలు జూలై 20 నుండి 22వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. జూలై 19న సాయంత్రం అంకురార్పణంతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి.
వైదిక సంప్రదాయం ప్రకారం జాతాశౌచం, మృతాశౌచం వంటి వేళల్లో ఆలయ ప్రవేశం నిషిద్ధం. అయినా యాత్రీకుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలియక దోషాలు జరుగుతుంటాయి. ఇలాంటి వాటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు ప్రతి ఏడాదీ మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ.
పవిత్రోత్సవాల్లో భాగంగా మొదటిరోజు యాగశాలలో పవిత్ర ప్రతిష్ఠ, శయనాధివాసం, రెండో రోజు పవిత్ర సమర్పణ, యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. మూడో రోజు యాగశాలలో వైదిక కార్యక్రమాలు, పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి.
ప్రతి రోజూ ఉదయం స్నపన తిరుమంజనం, సాయంత్రం తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు. గృహస్తులు(ఇద్దరు) రూ.500/- చెల్లించి పవిత్రోత్సవాల్లో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, చివరిరోజు ఒక పవిత్రం బహుమానంగా అందజేస్తారు.
ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తారు.
ఐఓసీఎల్ గ్యాస్ స్టోరేజ్ కేంద్రానికి తిరుమలలో భూమిపూజ
టీటీడీ భవిష్యత్ అవసరాల నిమిత్తం తిరుమలలోని ఔటర్ రింగ్ రోడ్డులో 45 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో గ్యాస్ స్టోరేజ్ కేంద్ర నిర్మాణానికి బుధవారం టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్. నాయుడుభూమిపూజ నిర్వహించారు.
ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ, గత రెండు దశాబ్దాలుగా ఐఓసీఎల్ సంస్థ ఎల్పీజీని టీటీడీకి నిరంతరాయంగా సరఫరా చేస్తోందని, ఇకపై 30 సంవత్సరాల పాటు ఎల్పీజీ సరఫరాకు టీటీడీ-ఐఓసీఎల్ఒప్పందం కుదిరిందని తెలిపారు.
రూ.8.13 కోట్ల వ్యయంతో 1.86 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్లాంట్‌ను టీటీడీ-ఐఓసీఎల్ సంయుక్తంగా ఆరు నెలల్లో పూర్తి చేస్తామని చెప్పారు. ఈ గ్యాస్‌ను లడ్డూ ప్రసాదాలు, అన్నప్రసాదాల తయారీకి వినియోగించనున్నట్లుతెలిపారు. ఈ ప్రాజెక్టుల వల్ల టీటీడీకి సంవత్సరానికి రూ.1.5 కోట్ల ఆదా జరుగుతుందని పేర్కొన్నారు.
ఐఓసీఎల్ మార్కెటింగ్ డైరెక్టర్ శ్రీ వి.సతీష్ కుమార్ మాట్లాడుతూ ఇప్పటికే తిరుమల డంపింగ్ యార్డు వద్ద రూ.12.05 కోట్ల వ్యయంతో బయో గ్యాస్ ప్లాంట్ నిర్మాణం జరుగుతోందన్నారు. ప్రతి రోజు వచ్చే 55 టన్నులతడి వ్యర్థాలలో 40 టన్నులు ఐఓసీఎల్ ప్లాంటుకు తరలించి రోజుకు 1000 కేజీల బయో గ్యాస్‌ను ఉత్పత్తి చేయనున్నామని తెలియజేశారు.
ఈ ప్లాంట్‌లో 45 మెట్రిక్ టన్నుల మౌండెడ్ స్టోరేజ్ వెసల్స్, 1500 కిలోల వేపరైజర్, అగ్నిమాపక యంత్రాంగం, స్ప్రింక్లర్ వ్యవస్థ, రెండు వాటర్ ట్యాంకులు, డీజిల్ జనరేటర్ సెట్, రిమోట్ ఆపరేటింగ్ వాల్వులు, గ్యాస్లీకేజ్ అలారం, ట్యాంక్ లారీ డికాంటేషన్ వ్యవస్థ, సీసీటీవీ, జీఎంఎస్, టీఎఫ్‌ఎంఎస్, ఐఎల్‌ఎస్‌డీ వంటి అత్యాధునిక భద్రతా పరికరాలు ఏర్పాటు చేయనున్నారు.