శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఆలయాన్ని రంగు రంగుల విద్యుత్ దీపాలు, పెయింటింగ్‌లతో ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యింది. మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు భక్తులు మన రాష్ట్రం నుంచే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షలాదిగా పాదయాత్ర చేస్తూ నల్లమల కొండలు దాటుకుని శ్రీశైలం తరలివస్తారు. శ్రీశైలం వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా భక్తుల సౌకర్యార్ధం దేవస్థానం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. తాగునీరు, వసతి, వైద్యం, దర్శనానికి ప్రత్యేక క్యూ లైన్లు, మినరల్ వాటర్ ప్లాంట్లు, ప్రసాదం తదితర ఏర్పాట్లు చేశారు. స్వామివారి దర్శనానికి భక్తులు ఐదు రోజుల ముందు నుంచే పాదయాత్రతో శ్రీశైలం తరలి వస్తారు. వారికోసం శ్రీశైలానికి 10 కిలోమీటర్ల దూరంలోని కైలాస ద్వారం, భీముని కొలను, హటకేశ్వరం మెట్ల మార్గంలో వచ్చే భక్తులు సేద తీరేందుకు భారీ షెడ్లు నిర్మించారు. శ్రీశైలం వచ్చిన భక్తులకు శ్రీస్వామి అమ్మవారి దర్శనానికి ప్రత్యేక క్యూ లైన్లు, అదనపు క్యూ లైన్లు, చంటి బిడ్డ తల్లులకు, వయో వృద్ధులకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. అలాగే క్యూ లైన్‌లో దర్శనానికి వెళ్లే భక్తులకు దేవస్థానం ఈ సంవత్సరం 300 మిల్లీ లీటర్ల వాటర్ బాటిల్‌ని కూడా అందజేయనుంది. వాటితో పాటు అల్పాహారం, పాలు, బిస్కెట్లు అందించే ఏర్పాట్లు చేశారు. అలాగే ఈ సంవత్సరం భక్తులకు 24వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ఉచితంగా లడ్డూను ఇవ్వనున్నట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు.