ఏపీ లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. రెండు రోజులుగా తిరుమల, తిరుపతి లో కురుస్తోన్న వానల దెబ్బకు భక్తులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మొన్న రాత్రి భారీ వర్షాలు కురవడంతో..తిరుమల ఘాట్ రోడ్డులో కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో అప్రమత్తమైన టీటీడీ అధికారులు బుల్డోజర్లతో కొండచరియలను పక్కకు తొలగించారు. భారీ వర్షాల నేపథ్యంలో శ్రీవారి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.
ఏపీలో ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించడంతో.. తిరుమలకు వెళ్లే శ్రీవారి మెట్టు నడక మార్గాన్ని ఇవాళ మూసివేశారు టీటీడీ అధికారులు. భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయనే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు టీటీడీ ఈవో శ్యామలరావు. బుధవారం టీటీడీ ఉన్నతాధికారులతో వర్చువల్ గా సమావేశాన్ని నిర్వహించి పలు సూచనలు చేశారు.
వర్షాల కారణంగా ఘాట్ రోడ్లలో కొండచరియలు విరిగిపడితే వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఘాట్ రోడ్లలో జేసీబీలను సిద్ధంగా ఉంచుకోవాలని చెప్పారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చూడాలని.. జనరేటర్లు నడపడం కోసం డీజిల్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఇప్పటికే పాపవినాశనం, శిలా తోరణం మార్గాలను టీటీడీ మూసివేసింది. వాతావరణ పరిస్థితులను బట్టి ఈ మార్గాల్లో రాకపోకలను టీటీడీ పునరుద్ధరించ నుందని తెలిపారు.