తిరుమల క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. వరుసగా మూడు రోజులు సెలవులు, ఇంటర్ ఫలితాలు రావడం, ముందస్తుగానే వేసవి సెలవులు ఇస్తుండటంతో తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. శని, ఆదివారాలతో పాటు, సోమవారం కూడా భక్తుల రద్దీ కొనసాగుతోంది.
వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు ఉదయం నుంచే కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. ఆదివారం శ్రీవారిని 82 వేల 746 మంది భక్తులు దర్శించుకున్నారు. హుండీల ద్వారా 3.85 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. భక్తుల రద్దీ రోజు రోజుకు పెరుగుతుండటంతో టీటీడీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వేసవి తాపాన్ని తట్టుకునేందుకు భక్తుల కోసం చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. అలాగే ఎక్కడికక్కడ వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి డాక్టర్లను అందుబాటులో ఉంచుతున్నారు. క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తులకు మంచి నీరు, మజ్జిగ, అన్నప్రసాదం అందిస్తున్నారు.