Tirumala : సెప్టెంబర్ 7న తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత

Update: 2025-08-27 14:30 GMT

చంద్రగ్రహణం కారణంగా సెప్టెంబర్ 7వ తేదీ సాయంత్రం 3.30 నుంచి మరుసటిరోజు తెల్లవారుజామున అనగా సెప్టెంబర్ 8వ తారీఖు 3 గంటల వరకు తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయాన్ని సుమారు 12గం పాటు మూసివేయనున్నారు. సెప్టెంబర్ 7వ తేదీ ఆదివారం రాత్రి 9.50 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమై సెప్టంబర్‌ 8న సోమ‌వారం వేకువ‌జామున 1.31 గంటలకు పూర్తవుతుంది. సాధారణంగా గ్రహణ సమయానికి 6 గంటల ముందుగా ఆలయం తలుపులు మూసివేయడం ఆనవాయితీ. సెప్టెంబర్ 8న ఉదయం 3 గంటలకు సుప్రభాతంతో ఆలయ తలుపులు తెరిచి శుద్ధి, పుణ్యహవచనం నిర్వహిస్తారు. అనంతరం తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహించనున్నారు. కాగా ఉదయం 6 గంటలకు శ్రీవారి దర్శనం భక్తులకు పునః ప్రారంభవుతుంది. చంద్రగ్రహణం కారణంగా సెప్టంబ‌ర్ 7వ‌ తేదీ ఆదివారం ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్స‌వం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. చంద్రగ్రహణం కారణంగా సెప్టంబ‌ర్ 7న ఆదివారం సాయంత్రం 3 గంటల నుండి తిరుమలలో అన్నప్రసాదాల వితరణ వుండదు. తిరిగి సెప్టంబ‌ర్ 8వ తేది ఉదయం 8.30 గంటలకు అన్నప్రసాదాల పంపీణి పున: ప్రారంభమవుతుంది.ఈ సందర్భంగా మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం, ఎస్వీ ఉద్యోగుల క్యాంటీన్‌, శ్రీ పద్మావతి విశ్రాంతి భవనం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2, పీఏసీ-2 ల‌లో అన్నప్రసాదాల వితరణ ఉండదు.భక్తుల సౌకర్యార్థం ముందస్తుగా టీటీడీ అన్నప్రసాదం విభాగం ఆధ్వర్యంలో 30 వేల పులిహోర ప్యాకెట్లను సెప్టెంబర్ 7 సాయంత్రం 4.30 గంటల నుండి పంపీణి చేయనున్నారు. ఇందులో భాగంగా శ్రీ‌వారి ఆల‌యం ఎదురుగా ఉన్న వైభ‌వోత్స‌వ మండ‌పం, రామ్ భ‌గీచా, పీఏసీ-1, సీఆర్వో, ఏఎన్సీ ప్రాంతాల్లోని ఫుడ్ కౌంట‌ర్లు, శ్రీ‌వారి సేవా స‌ద‌న్ వ‌ద్ద‌ భక్తులకు అన్నప్రసాదం ప్యాకెట్లను అందిస్తారు.

Tags:    

Similar News