TTD Chairman : తిరుత్తణి సుబ్రహ్మణ్య స్వామికి శ్రీవారి పట్టువస్త్రాల సమర్పించిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు
తమిళనాడులోని తిరుత్తణిలో వెలసిన శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి తిరుమల తిరుపతి దేవస్థానం తరపున శ్రీవారి కానుక సమర్పించారు. ఆడికృతిక పర్వదినాన్ని పురస్కరించుకుని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. తిరుత్తణి ఆలయ ఛైర్మన్ శ్రీధర్, తమిళనాడు దేవాదాయ శాఖ జాయింట్ కమిషనర్ రమణి.. టీటీడీ ఛైర్మన్‌కు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ పట్టువస్త్రాలను తనీకేసన్‌గా పూజలందుకుంటున్న శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి సమర్పించారు.
పట్టువస్త్రాల సమర్పణ అనంతరం, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆయనకు ఆశీర్వచనాలు పలికి, పట్టువస్త్రాలతో సత్కరించి, తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా బీఆర్ నాయుడు మాట్లాడుతూ.. టీటీడీ తరపున శ్రీవారి పట్టువస్త్రాలను సమర్పించడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఆడికృతిక పర్వదినం సందర్భంగా లక్షలాది మంది భక్తులు తిరుత్తణికి వస్తున్నారని.. వారందరికీ స్వామివారి అనుగ్రహం లభించాలని ఆకాంక్షించారు.