తిరుమలలో భక్తులకు అందుతున్న సేవలు, సదుపాయాల నిర్వహణపై మంగళవారం టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్. నాయుడు ఆకస్మిక తణిఖీలు నిర్వహించారు. శ్రీవారి ఆలయం వద్దకు విచ్చేసిన చైర్మన్, బోర్డు సభ్యులు అక్కడ భక్తులతో మమేకమై వివిధ సేవా సౌకర్యాలపై ఆరా తీశారు. తిరుమలలో త్రాగునీరు, అన్నదానం, క్యూలైన్ల నిర్వహణ, పారిశుద్ధ్యంపై భక్తుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు చైర్మన్ తో మాట్లాడుతూ ఇటీవల తిరుమలలో భక్తుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చిన సదుపాయాలు, సౌకర్యాలు మరింత మెరుగుపడ్డాయని, అన్నదానంలో అందిస్తున్న అన్నప్రసాదాలు ఎంతో రుచికరంగా ఉన్నాయని ఆనందం వ్యక్తం చేశారు. ఈ తనిఖీల్లో టీటీడీ బోర్డు సభ్యులు శ్రీమతి పనబాక లక్ష్మీ, శ్రీ జంగా కృష్ణమూర్తి, శ్రీ శాంతా రామ్, శ్రీ నరేష్ కుమార్, శ్రీమతి జానకీ దేవి, అధికారులు, సిబ్బంది కూడా పాల్గొన్నారు.