TTD EO : టీటీడీ ధార్మిక ప్రాజెక్టులపై టీటీడీ ఈవో సమీక్ష

Update: 2025-08-30 11:00 GMT

టీటీడీ ఆధ్వర్యంలోని అన్ని ధార్మిక ప్రాజెక్టుల పని తీరుపై టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు శుక్రవారం తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో గల తన కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ అన్నమయ్య కీర్తనలు విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రాష్ట్ర స్థాయి కాంపిటీషన్లు నిర్వహించాలని, అందుకు ముందస్తుగా ఆడిషన్లు చేపట్టాలని సూచించారు. అదేవిధంగా అన్నమయ్య సాహిత్యాన్ని కళాశాలలు,విశ్వవిద్యాలయలలో పరిశోధనలకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. పిల్లలకు, యువత లో అన్నమయ్య కీర్తనలు పట్ల మక్కువ పెంచేందుకు వినూత్న కార్యక్రమాలు రూపొందించాల్సిందిగా ఆయన అధికారులను ఆదేశించారు.

హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో సరి కొత్త కార్యక్రమాలను ప్రారంభించాలని ఆదేశించారు. హరికథకు పూర్వ వైభవం తీసుకురావడానికి ఈ నెల 31న నిర్వహించబోయే ”హరికథ వైభవం” కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రతి ప్రాజెక్ట్ కు ఈవెంట్స్ తో కూడిన వార్షిక క్యాలెండర్ సిద్ధం చేయాలని ఆదేశించారు. అన్ని టీటీడీ ఆలయాలలో క్రమం తప్పకుండా సాంస్కృతిక, ఆధ్యాత్మిక , భక్తి కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.

గిరిజన ప్రాంతాలలో శ్రీనివాస కల్యాణాలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అన్నారు. ఎస్‌వీ రికార్డింగ్ ప్రాజెక్ట్ ద్వారా అన్నమయ్య కీర్తనలను సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసి యువతకు చేరువ చేయాలని ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో జేఈఓ శ్రీ వీరబ్రహ్మం, ఇతర ప్రాజెక్టుల అధికారులు పాల్గొన్నారు.

Tags:    

Similar News