కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తులకు టిటిడి కీలక ప్రకటన చేసింది. ఈ నెల 15, 16 తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించింది టీటీడీ..
తిరుమలలో ప్రతి ఏటా నాలుగుసార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశికి ముందు వచ్చే మంగళవారం రోజు కోయిల్ ఆళ్వార్ ఆలయాన్ని శుద్ధి చేస్తారు. ఇందులో భాగంగా జులై 15 మంగళవారం ఉదయం 6 గంటలకు తిరుమంజనం ప్రారంభిస్తారు. కాబట్టి ఆరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతించనున్నారు. అలాగే, జులై 16 బుధవారం జరిగే ఆణివార ఆస్థానం సందర్భంగా ఉదయం 7 గంటలకు ఆలయ బంగారు వాకిలి ముందు గల ఘంటా మండపంలో మలయప్ప స్వామిని గరత్మంతునికి ఆభిముఖంగా కొలువు చేస్తారు. ఈ నేపథ్యంలో మొదటిరోజు అష్టదళపాదపద్మారాధన మరుసటిరోజు కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకారన సేవలను టీటీడీ రద్దు చేసింది.
ఇదిలా ఉండగా... శ్రీవారి ఆలయంలో గత 15 రోజులుగా భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా టీటీడీ అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఈ రోజు భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. స్వామి వారి దర్శనం కోసం 29 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు భక్తులు..