తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా సీనియర్ ఐఏఎస్ అధికారి అనిల్ కుమార్ సింఘాల్ తిరిగి బాధ్యతలు స్వీకరించారు. ఈవోగా బాధ్యతలు చేపట్టడానికి ముందు ఆయన అలిపిరి మార్గంలో కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. తన కుటుంబ సభ్యులతో కలిసి ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలో ఈవోగా ప్రమాణం చేశారు. రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆయనకు ఆశీర్వచనాలు అందించారు. టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఆయనకు శేషవస్త్రం కప్పి, స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు
అనంతరం అనిల్ కుమార్ సింఘాల్ మాట్లాడుతూ.. టీటీడీ ఈవోగా రెండోసారి అవకాశం కల్పించినందుకు సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవకాశం రావడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. కాలినడకన వస్తున్నప్పుడు భక్తులు కొన్ని సమస్యలను తన దృష్టికి తీసుకొచ్చారని, వాటిని పరిష్కరించి భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించడానికి చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. తిరుమల పవిత్రతను కాపాడాలని, సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం చంద్రబాబు తనకు సూచించారని సింఘాల్ వెల్లడించారు. ఈ ఆదేశాలకు అనుగుణంగా తన విధులు నిర్వర్తిస్తానని ఆయన స్పష్టం చేశారు.