ఏప్రిల్ 9న ఉగాది పండగ సందర్భంగా తెలుగు ప్రజలు ‘క్రోధి’నామ సంవత్సరంలోకి (Krodhi Nama Samvatsara) అడుగుపెట్టనున్నారు. ఇది కలియుగంలో 5,125వ సంవత్సరం. క్రోధినామ సంవత్సరం అంటే క్రోధమును కలిగించేదని అర్థం. అంటే ప్రజలు కోపం, ఆవేశంతో వ్యవహరిస్తారని పండితులు చెబుతున్నారు. కుటుంబసభ్యుల మధ్య కోపతాపాలు, రాష్ట్రాల మధ్య భిన్నాభిప్రాయాలు, దేశాల మధ్య కోపావేశాలతో యుద్ధ వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని అంటున్నారు.
ఉగాది అంటే ఏంటి?
ఉగస్య ఆది అనేదే ఉగాది. "ఉగ" అనగా నక్షత్ర గమనం - జన్మ - ఆయుష్షు అని అర్థాలు. వీటికి 'ఆది' అనగా మొదలు 'ఉగాది'. అనగా ప్రపంచం జన్మ ఆయుష్షులకు మొదటిరోజు కనుక ఉగాది అయింది. ఇంకొకవిధంగా చెప్పాలంటే, 'యుగం' అనగా రెండు లేక జంట అని కూడా అర్ధం. ఉత్తరాయణ, దక్షిణాయనములనబడే ఆయన ద్వయ సంయుతం 'యుగం' (సంవత్సరం) కాగా, ఆ యుగానికి ఆది యుగాది అయింది. అదే సంవత్సరాది.
ఉగాది - వసంతాలకు గల అవినాభావ సంబంధం, సూర్యునికి సకల ఋతువులకు ప్రాతః సాయం కాలాది త్రికాలములకు ఉషాదేవతయే మాతృస్వరూపం. భారతీయ సంప్రదాయం ప్రకారం చైత్ర శుక్ల పాడ్యమి నాడే అనగా ఉగాది రోజున సృష్టి జరిగిందని పురాణైతికంగా చెప్పబడింది.
భారతీయ సంప్రదాయం ప్రకారం చైత్ర శుక్ల పాడ్యమి నాడు అంటే ఉగాది రోజున సృష్టి జరిగినట్లు పురాణాలు చెప్తున్నాయి. వేదాలను హరించిన సోమకుని వధించి మత్స్యావతారధారియైన విష్ణువు వేదాలను బ్రహ్మ కప్పగించిన శుభతరుణ పురస్కారంగా విష్ణువు ప్రీత్యర్ధం “ఉగాది” ఆచరణలోకి వచ్చెనని పురాణ ప్రతీతి. ఈ రోజున వేపపువ్వు పచ్చడి, పంచాంగ శ్రవణము, మిత్రదర్శనము, ఆర్యపూజనము, గోపూజ, ఏరువాక అనబడే ఆచారాలు పాటిస్తారు.