గత రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచి కొడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కాగా రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని...దీంతో రానున్న ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. మరో రెండు రోజుల్లో వాయుగుండం బలపడి శనివారం నాటికి తీరం దాటవచ్చని అంచనా వేసింది. దీంతో ఈరోజు నుండే విస్తారంగా వర్షాలు కురుస్తాయని.. కొన్నిప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.
అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, ఉమ్మడి పశ్చిమ గోదావరి, ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది. గత 24 గంటల్లో కడప, కర్నూల్, చిత్తూరు, ఎన్టీఆర్, తిరుపతి, నంద్యాల, శ్రీసత్యసాయి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసినట్లు తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని...అవసరం అయితే తప్ప బయటకు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రతగా ఉండాలని.. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు తెలిపారు.