Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వానలు.. రానున్న మూడు రోజుల పాటు..
తెలుగు రాష్ట్రాలలో మళ్ళీ వానలు దంచి కొట్టనున్నాయి. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనాలు, ద్రోణుల ప్రభావంతో రానున్న మూడు మూడు రోజుల పాటు ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం తీవ్ర ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. పగలు పొడి వాతావరణం ఉన్నప్పటికీ ... సాయంత్రం తర్వాత వాతావరణం చల్లబడి వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. కాగా తెలంగాణలోని యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వనపర్తి, జోగులాంబ గద్వాల, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్ జిల్లాలలో మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
అదేవిధంగా రానున్న 24 గంటల్లో ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రాయలసీమ ,దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తాలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని... అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అనంతపురం, సత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇక భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని..అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు సూచించారు.