Road Accident : దైవ దర్శనానికి వెళ్లొస్తూ అనంత లోకాలకు.. ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం
తిరుమల శ్రీవారిని దర్శించుకొని వెళ్తున్న ఆ కుటుంబాన్ని మృత్యువు కబళించింది. శ్రీ వెంకటేశ్వర స్వామి కి మొక్కులు చెల్లించుకొని సంతోషంగా ఇంటికి బయలు దేరిన కుటుంబ సభ్యులు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. తిరుపతి _ బెంగళూరు హైవేపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృత్యు వాత పడ్డారు. వీరిలో ఐదేళ్ల చిన్నారి కూడా ఉండడం బాధాకరం.
పోలీసుల వివరాల ప్రకారం... శ్రీకాంత్(35), చందన భార్యభర్తలు. వీరికి ఐదేళ్ల కుమారుడు శ్రియాన్ ఉన్నాడు. శ్రీకాంత్ బెంగుళూరు లోని ఓ ప్రైవేటు కంపెనీ లో పని చేస్తున్నాడు. తన కుమారుడు శ్రియాన్ కి సంబంధించి ఉన్న తులాభారం మొక్కు కోసం తల్లి లక్ష్మీదేవి(55), కుమారుడితో కలిసి కారులో తిరుమలకు వచ్చాడు శ్రీకాంత్. శ్రీవారికి తమ మొక్కులు చెల్లించుకొని ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు. అయితే ఇదే వారికి చివరి ప్రయాణం అని ఆ కుటుంబానికి అర్థం కాలేదు. రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు వారిని వెంటాడింది. అతివేగంతో వచ్చిన శ్రీకాంత్ కారు తెల్లగుండ్లపల్లె సమీపంలో పెట్రోల్ బంకు వద్ద ఆగి ఉన్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో తల్లీ, కుమారుడు తో పాటు మనవడు కూడా ప్రాణాలు కోల్పోవడం అందరిని కలిచి వేసింది.ఈ ఘటన పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.