గుండె వేగం పెంచే వ్యాయామాలతో పాటు గుండెకు విశ్రాంతినిచ్చే వ్యాయామాలు చేయడమూ అవసరమే! నిత్యం శరీరమంతా రక్తాన్ని పంప్ చేస్తూ అలసిపోయే గుండెకు నిద్రలో తప్ప విశ్రాంతి దొరకదు. ఆ భంగిమలో కూడా గుండె మీద అంతో కొంత ఒత్తిడి ఉంటూనే ఉంటుంది. అయితే రక్తప్రసార వేగాన్ని తగ్గించి గుండెకు సాధ్యమైనంత ఎక్కువ విశ్రాంతినిచ్చే భంగిమలూ ఉన్నాయి. వాటితో గుండెకు ఉపశమనం కలుగుతుంది. కాబట్టి ఇదిగో ఈ వ్యాయామం కోసం రోజు మొత్తంలో కనీసం ఐదు నిమిషాలు కేటాయించండి. ఈ వ్యాయామం ఎలా చేయాలంటే?
● గోడకు దగ్గరగా మ్యాట్ వేసుకుని వెల్లకిలా పడుకోవాలి.
● ఇలా పడుకున్నప్పుడు మోకాళ్లను మడిచి, పైకి లేపి, పిరుదులు గోడకు తగిలేలా దగ్గరగా జరగాలి.
● చేతులను వెనక్కి వాల్చేసి, కాళ్లను నెమ్మదిగా నిటారుగా పైకి లేపాలి.
● పైకి లేపిన కాళ్లను గోడకు ఆనించి, బరువును గోడ మీదే వేయాలి.
● ఈ భంగిమలో ఉన్నప్పుడు మనసు ప్రశాంతంగా ఉంచుకుని, ఊపిరి పీల్చుకోవాలి.
● ఆ సమయంలో గుండె వేగం తగ్గడం స్పష్టంగా తెలుస్తుంది.
● ఇలా 5 నిమిషాలపాటు ఉండి నెమ్మదిగా కాళ్లను కిందకి దించి, చేతులు నేల మీద ఉంచి, లేచి నిలబడాలి.