Afghanistan Crisis: అఫ్గన్‎లోని పరిణామాలపై అఖిలపక్ష సమావేశం

Afghanistan Crisis: అఫ్గనిస్థాన్‌ లో చోటుచేసుకున్న పరిణామాలపై కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది.

Update: 2021-08-26 12:20 GMT

అఫ్గనిస్థాన్‌ లో చోటుచేసుకున్న పరిణామాలపై కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. విదేశాంగ మంత్రిజైశంకర్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశానికి ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌తోపాటు ఇతర పార్టీల నేతలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీనుంచి గల్లా జయదేవ్, టీఆర్ ఎస్ నుంచి నామా నాగేశ్వర రావు, వైసీపీ నుంచి మిథున్ రెడ్డి సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్రం తీసుకుంటున్న చర్యలను కేంద్రమంత్రి వారికి వివరించారు.

దేశ ప్రయోజనాల సంబంధించిన విషయాల్లో టీఆర్ ఎస్ పార్టీ ఎప్పుడు కేంద్రప్రభుత్వానికి మద్దతు ఇస్తుందన్నారు ఎంపి నామా నాగేశ్వర రావు. అఫ్గనిస్థాన్‌లో చిక్కుకున్న దేశ పౌరులను సురక్షితంగా తరలించాలని కేంద్రాన్ని కోరినట్లు ఆయన వెల్లడించారు. అంతర్జాతీయ స్థాయిలో ఇతర దేశాలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తామని కేంద్రమంత్రి స్పష్టంచేసినట్లు ఎంపి వివరించారు.

అఫ్గాన్ విషయంలో ఐక్యరాజ్యసమితి ఏం చేయబోతుందని కేంద్రమంత్రిని ప్రశ్నించామన్నారు టీడీపీ ఎంపి గల్లా జయదేవ్. ఉగ్రవాదం, శరణార్థుల అంశాలపై భారత్ దృష్టిసారించిందని మంత్రి వెల్లడించినట్లు ఆయన పేర్కొన్నారు. అఫ్గాన్‌ ను ఉగ్రవాదుల అడ్డా కానివ్వకుండా చర్యలు తీసుకోవాలని, ఉగ్రవాదం పెరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరినట్లుగల్లా జయదేవ్ తెలిపారు. 

Tags:    

Similar News