బీజేపీ అధికారంలోకి వస్తే మహిళలకు 33% కోటా: పశ్చిమ బెంగాల్‌లో అమిత్ షా
మమతా బెనర్జీ సర్కార్‌ను ఓడించి బీజేపీను అధికారంలోకి తేవడం మాత్రమే తమ లక్ష్యం కాదని ఇక్కడి పరిస్థితుల్లో మార్పు తేవడమే లక్ష్యమన్నారు.;
పశ్చిమ బెంగాల్‌ను బంగారు రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకే బీజేపీ పోరాడుతోందన్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. మమతా బెనర్జీ సర్కార్‌ను ఓడించి బీజేపీను అధికారంలోకి తేవడం మాత్రమే తమ లక్ష్యం కాదని ఇక్కడి పరిస్థితుల్లో మార్పు తేవడమే లక్ష్యమన్నారు.
మరికొద్ది నెలల్లో ఎన్నికలు జరగనున్నవేళ రెండు రోజుల పర్యటన నిమిత్తం బెంగాల్‌కు వచ్చిన అమిత్ షా.. దక్షిణ 24 పరగణాల జిల్లాలోని కాక్‌ద్విప్‌లో ఐదో విడత పరివర్తన్ ర్యాలీ ప్రారంభించారు. రాష్ట్రంలో భాజపా అధికారంలోకి వస్తే మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని, ప్రభుత్వ ఉద్యోగులకు ఏడో వేతన సంఘం ప్రయోజనాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
బెంగాల్ ఎన్నికల్లో పోరాటం తమ పార్టీ బూత్ కార్యకర్తలు, తృణమూల్ కాంగ్రెస్ సిండికేట్ల మధ్యేనన్నారు అమిత్ షా. రాబోయే ఎన్నికల్లో పశ్చిమబెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటవుతుందన్నారు. అధికారంలోకి వచ్చాక ఏటా లక్షలాది మంది యాత్రికులు వచ్చే గంగాసాగర్ మేళాను అంతర్జాతీయ టూరిస్ట్ సర్క్యూట్‌గా మారుస్తామన్నారు అమిత్ షా. కేంద్రం చేపడుతున్న అన్ని పర్యాటక ప్రాజెక్టులను బెంగాల్‌లో విజయవంతంగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు.