Arya Rajendran : పెళ్లితో ఒకటి కానున్న యంగ్ ఎమ్మెల్యే, యంగ్ మేయర్..!

Arya Rajendran : ఒకరు ఆ రాష్ట్ర అసెంబ్లీలో అతి తక్కువ వయసు ఉన్న ఎమ్మెల్యేగా రికార్డు సృష్టిస్తే.. మరొకరు అతి చిన్న వయసులోనే మేయర్‌ పీఠాన్ని అధిరోహించి దేశ ప్రజలను ఆశ్చర్యపరిచారు.

Update: 2022-02-16 12:30 GMT

Arya Rajendran : వారిద్దరిది కేరళ రాష్ట్రం.. ఇద్దరు ప్రజాప్రతినిధులే..  ఒకరు ఆ రాష్ట్ర అసెంబ్లీలో అతి తక్కువ వయసు ఉన్న ఎమ్మెల్యేగా రికార్డు సృష్టిస్తే.. మరొకరు అతి చిన్న వయసులోనే మేయర్‌ పీఠాన్ని అధిరోహించి దేశ ప్రజలను ఆశ్చర్యపరిచారు. ఇప్పుడు వీరిద్దరూ వివాహబంధంతో ఒకటికానున్నారు.

ఇంతకీ వారెవారంటే.. తిరువనంతపురం మేయర్ ఆర్యా రాజేంద్రన్‌, బలుస్సెరీ ఎమ్మెల్యే సచిన్ దేవ్‌. చదువు తర్వాత బాలసంఘం, ఎస్ఎఫ్ఐలో పనిచేస్తున్న సమయంలో వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది.. ఆ పరిచయం స్నేహంగా మారింది. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సెక్రటరీగా ఉన్న సమయంలో సచిన్ దేవ్‌కు 2021లో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అధికార సీపీఎం పార్టీ అవకాశం ఇచ్చింది.


దీనితో  అతను బలుస్సెరీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి నటుడు ధర్మజన్ బోల్గట్టిపై 20,000 ఓట్ల తేడాతో విజయం సాధించారు. దీంతో కేరళ రాష్ట్రంలో అతిచిన్న వయస్సుల్లో ఎమ్మెల్యేగా గెలుపొందిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు. అటు ఆర్యా రాజేంద్రన్‌ తిరువనంతపురం మేయర్ అభ్యర్థిగా సీపీఎం పార్టీ నుంచి పోటీ చేసి గెలిచింది.


ఈ క్రమంలోనే 21 ఏళ్ల వయసులో ఈ పదవికి ఎన్నికై దేశం దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ విషయాన్ని సచిన్ దేవ్‌ ప్రకటించారు. అయితే ఇంకా పెళ్లి తేదిని వెల్లడించలేదు. 

Similar News