ఢిల్లీలో ఆక్సిజన్ సంక్షోభం.. ఆర్మీ సాయం కోరిన ఆప్ సర్కార్
దేశ రాజధాని నెలకొన్న ఆక్సిజన్ సంక్షోభాన్ని అధిగమించేందుకు ఆర్మీ సాయం కావాలని ఢిల్లీ ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది.;
దేశ రాజధాని నెలకొన్న ఆక్సిజన్ సంక్షోభాన్ని అధిగమించేందుకు ఆర్మీ సాయం కావాలని ఢిల్లీ ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. నగరంలో కొవిడ్ ఉధృతి రోజురోజుకు పెరుగుతున్న వేళ.... ప్రత్యేక కొవిడ్ కేంద్రాల నిర్వహణ, ఆక్సిజన్ సరఫరా బాధ్యతలు ఆర్మీ చేపట్టాలని కోరుకూ ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు లేఖ రాశారు. ఇదే విషయంపై ఢిల్లీ హైకోర్టులోనూ ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలైంది. పిటిషన్‌పై విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు, ఢిల్లీ ప్రభుత్వ విజ్ఞప్తిపై నివేదిక ఇవ్వాలని కేంద్రాన్ని కోరింది.
ఢిల్లీలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోన్న వేళ.. పలు ఆస్పత్రులు ఆక్సిజన్ తీవ్ర కొరతను ఎదుర్కొంటున్నాయి. రెండు, మూడు వారాలుగా సమస్య తీవ్రరూపం దాల్చినా ప్రభుత్వ యంత్రాంగం అధిగమించలేకపోతోంది. ఈ సమయంలో రాజధానిలోని ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత కేసులను ఢిల్లీ హైకోర్టు విచారిస్తోంది. ఈ నేపథ్యంలో ఆక్సిజన్ సరఫరా బాధ్యతను ఆర్మీ చేపట్టాలని కోరుతూ ఢిల్లీ ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసినట్టు ప్రభుత్వం తరుఫున సీనియర్ న్యాయవాది రాహుల్ మెహ్రా హైకోర్టుకు విన్నవించారు. ఇప్పటికే ఈ విషయంపై ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా రక్షణ మంత్రికి లేఖ రాసినట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో కేంద్రం స్పందన కోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు.
ఢిల్లీలో ఆక్సిజన్ సరఫరా చేసేందుకు అత్యవసర సహాయం కావాలని... ఇందుకోసం అందుబాటులోని అన్ని వనరులు వినియోగించుకొని ప్రయత్నాలు చేస్తున్నామని ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా తెలిపారు. ఇప్పటికే ఆర్మీ, కేంద్రప్రభుత్వం, ప్రైవేటు విభాగాలను విజ్ఞప్తి చేశామని పేర్కొన్నారు. అయినప్పటికీ నగరంలో ఆసుపత్రులకు సరిపడా ఆక్సిజన్ అందడం లేదని అన్నారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వైరస్ ఉధృతి ఎక్కువ కావడంతో పలుచోట్ల ఆక్సిజన్ కొరత తీవ్రంగా వేధిస్తోంది. కర్ణాటకలోనూ ఆక్సిజన్ కొరతతో ఒకే ఆస్పత్రిలో 24మంది రోగులు మరణించారనే వార్తలు కలవరపెడుతున్నాయి.