Pegasus News: వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తే సహించం: సుప్రీంకోర్టు
Pegasus News: పెగాసస్ వ్యవహారంపై నిపుణుల కమిటీ వేసింది సుప్రీంకోర్టు.;
Pegasus News (tv5news.in)
Pegasus News:పెగాసస్ వ్యవహారంపై నిపుణుల కమిటీ వేసింది సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ ఆర్వీ రవీంద్రన్ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీని నియమించింది. ఈ కమిటీలో రిటైర్డ్ ఐపీఎస్ అలోక్ జోషి, సందీప్ ఒబెరాయ్ ఉన్నారు. పిటిషనర్లు లేవనెత్తిన అన్ని అంశాలపై ఈ త్రిసభ్య కమిటీ విచారణ చేయనుంది. మొత్తం ఏడు అంశాలపై నిపుణుల కమిటీ దర్యాప్తు చేయబోతోంది.
జాతీయ భద్రత పేరుతో కేంద్రం తన బాధ్యత నుంచి తప్పించుకోలేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కమిటీ ఏర్పాటు చేస్తామన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను సైతం సుప్రీంకోర్టు తిరస్కరించింది. ప్రస్తుత నిపుణుల కమిటీ తీరును స్వయంగా పర్యవేక్షిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తే సహించేది లేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
టెక్నాలజీ దుర్వినియోగంపై పరిశీలన చేస్తామన్న ధర్మాసనం.. ప్రాధమిక హక్కుల ఉల్లంఘనను కోర్టు సహించబోదని స్పష్టం చేసింది. చట్టబద్ధ పాలన సాగాలన్నదే తమ అభిమతమని, విచక్షణ లేని నిఘా ఆమోదయోగ్యం కాదని అభిప్రాయపడింది. ఈ కేసులో కొందరు పిటిషన్లరు పెగాసస్ బాధితులేనన్న కోర్టు.. నిఘాతో భావ ప్రకటన స్వేచ్ఛకు తీవ్ర విఘాతం కలుగుతోందని కామెంట్ చేసింది. ప్రస్తుతం అందరం సమాచార యుగంలో జీవిస్తున్నామని, గోప్యత హక్కును కాపాడుకోవడం పౌరుల హక్కు అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.