PM Modi Net Worth : సొంత వాహనం కూడా లేని ప్రధాని మోదీ.. ఇన్‌కమ్ సోర్స్ ఆ ఒక్కటే..!
PM Modi Net Worth : సాక్షాత్తు దేశ ప్రధాని అయి ఉండి, దశాబ్దాలుగా రాజకీయ నాయకుడిగా ఉన్నప్పటికీ.. మోదీకి మాత్రం కేవలం మూడు కోట్ల 7 లక్షల రూపాయల ఆస్తులు మాత్రమే ఉన్నాయి.;
PM Modi Net Worth : సాధారణంగా రాజకీయ నాయకులు అంటేనే కోట్ల రూపాయల ఆస్తులు ఉంటాయి. ఎన్నికల అఫిడవిట్లలో చూపించేది కొంత అయితే.. బ్లాక్ మనీ రూపంలో దాచుకునేది కొండంత. అలాంటిది.. సాక్షాత్తు దేశ ప్రధాని అయి ఉండి, దశాబ్దాలుగా రాజకీయ నాయకుడిగా ఉన్నప్పటికీ.. మోదీకి మాత్రం కేవలం మూడు కోట్ల 7 లక్షల రూపాయల ఆస్తులు మాత్రమే ఉన్నాయి. రాజకీయ నాయకులు పారదర్శకత కోసం తమ ఆస్తులు ప్రకటించాలని అటల్ బిహారి వాజ్‌పేయీ 2004లో పిలుపునిచ్చారు. అప్పటి నుంచి కొంతమంది రాజకీయ నేతలు వారి ఆస్తుల వివరాలు బయటకు చెబుతున్నారు. ఇందులో భాగంగానే భారత ప్రధాని నరేంద్ర మోదీ.. ప్రతి ఏడాది తన ఆస్తుల వివరాలను అధికారికంగా వెల్లడిస్తున్నారు. 2020లో 2 కోట్ల 85 లక్షలుగా ఉన్న మోదీ ఆస్తుల విలువ ఏడాదిలో మరో 22 లక్షలు పెరిగి 3 కోట్ల 7 లక్షల రూపాయలకు చేరింది.
మోదీ ఇన్‌కమ్ సోర్స్ ఒక్కటే. ప్రతి నెలా మోదీ అకౌంట్లో పడుతున్న రెండు లక్షల రూపాయల జీతం ఒక్కటే ఆదాయవనరు. ఈ జీతం డబ్బును ఫిక్స్‌డ్ డిపాజిట్లలో పెడతారు. దాని మీద వచ్చే వడ్డీని మళ్లీ పెట్టుబడిగా మారుస్తారు. అంతేతప్ప స్టాక్‌మార్కెట్లో పెట్టుబడుల జోలికి వెళ్లలేదు. మోదీ గాంధీనగర్‌లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్‌లో మోదీ ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశారు. వీటి విలువే ఎక్కువగా పెరిగినట్లు తెలుస్తోంది. గతేడాది ఫిక్స్డ్డిపాజిట్ల విలువ కోటీ 60 లక్షలు ఉండగా.. ఈ ఏడాది మార్చి 31 నాటికి అది కోటి 86 లక్షలకు చేరింది. మోదీ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్‌లో 8 లక్షల 90వేలు, ఎల్‌ఐసీ పాలసీలో లక్షన్నర, ఎల్అండ్ టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్బాండ్స్లో 20 వేలు పెట్టుబడి పెట్టారు.
ఇక ఇతర ఆస్తుల విషయానికొస్తే.. 2014లో ప్రధాని అయినప్పటి నుంచి ఇప్పటి వరకు మోదీ ఎలాంటి ఆస్తులు కొనలేదు. 2002లో కొనుగోలు చేసిన ఓ రెసిడెన్షియల్ప్రాపర్టీ విలువ కోటీ పది లక్షల రూపాయలుగా ఉంది. అయితే ఇది ఉమ్మడి ఆస్తి. ఇందులో మరో ముగ్గురికి వాటా ఉంది. బంగారం విషయానికొస్తే.. మోదీ వద్ద నాలుగు బంగారపు ఉంగరాలు మాత్రమే ఉన్నాయి. వీటి విలువ లక్షా 48వేల రూపాయలు. బ్యాంక్ బ్యాలెన్స్ లక్షన్నర, నగదు రూపంలో 36వేల రూపాయలు మాత్రమే ఉన్నాయి. మోదీకి సొంత వాహనం అనేదే లేదు. ఇవన్నీ ఈ ఏడాది మార్చి 31 నాటికి మోదీ అధికారికంగా చూపించిన ఆస్తుల లెక్కలు.
సాధారణ జీవితం గడుపుతున్న మోదీకి.. అంతకు తగ్గ ఆస్తులే ఉన్నాయి. కేవలం జీతం డబ్బులు మినహా మరే ఇన్‌కమ్ సోర్స్ లేవని తన ఆస్తుల జాబితా విడుదల చేశారు.