EPFO : ఉద్యోగులకు ప్రావిడెంట్ ఫండ్ అనేది కేవలం పొదుపు పథకం మాత్రమే కాదు. వారి వృద్ధాప్యానికి ఒక బలమైన ఆర్థిక మద్దతు. పీఎఫ్ నిధిపై ప్రభుత్వం ఏటా మంచి వడ్డీని ఇస్తుంది. అయితే చాలా మందిలో ఒక సందేహం ఉంటుంది. ప్రతి నెలా మన ఖాతాలో పెన్షన్(EPS) పేరుతో జమ అవుతున్న డబ్బుపై కూడా వడ్డీ వస్తుందా? దీనికి సంబంధించిన నిబంధనలను ఇప్పుడు తెలుసుకుందాం. నిజానికి ఉద్యోగి జీతం నుంచి కట్ అయ్యే మొత్తం రెండు ప్రధాన భాగాలుగా విభజించబడుతుంది. ఉద్యోగి ఇచ్చే 12% వాటా మొత్తం ఈపీఎఫ్ ఖాతాలోకి వెళ్తుంది. కానీ, యాజమాన్యం ఇచ్చే 12% వాటా రెండు భాగాలుగా విడిపోతుంది.. 3.67% EPF ఖాతాలోకి, మిగిలిన 8.33% EPS (ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్)లో జమ అవుతుంది.
ముఖ్య విషయం ఏమిటంటే, ఈపీఎఫ్ ఖాతాలో జమ అయ్యే మొత్తంపై మాత్రమే వడ్డీ లభిస్తుంది. కానీ, పెన్షన్ కింద జమ అయ్యే మొత్తంపై మాత్రం ఎటువంటి వడ్డీ లభించదు. ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ 1995 ప్రకారం ఇదే నిబంధన ఉంది. ఈ జమ చేసిన మొత్తానికి ప్రభుత్వం లేదా ఈపీఎఫ్ఓ అదనపు రిటర్న్స్ ఇవ్వదు. దీనికి కారణం ఏమిటంటే.. ఈ పెన్షన్ ఫండ్‌ను బ్యాంకు ఖాతా మాదిరిగా కాకుండా ఒక పూల్ ఫండ్ లాగా నిర్వహిస్తారు. పదవీ విరమణ తర్వాత ఉద్యోగులకు పెన్షన్ మొత్తాన్ని నిర్ణయించడానికి ఈపీఎఫ్ఓ ఒక నిర్దిష్ట ఫార్ములాను ఉపయోగిస్తుంది.
పెన్షన్ మొత్తం లెక్కించే ఫార్ములా
పెన్షన్ ఫండ్‌పై వడ్డీ రాకపోయినా, పదవీ విరమణ తర్వాత పెన్షన్ మొత్తాన్ని ఈపీఎఫ్ఓ ఒక ఫార్ములా ద్వారా లెక్కిస్తుంది.
ఆ ఫార్ములా: (పెన్షన్ కు అర్హత కలిగిన జీతం)*(పని చేసిన మొత్తం సంవత్సరాలు)/70.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ప్రస్తుతం పెన్షన్ లెక్కింపు కోసం పరిగణలోకి తీసుకునే గరిష్ట జీతం రూ.15,000 మాత్రమే. మీ జీతం ఎంత ఎక్కువ ఉన్నప్పటికీ, లెక్క రూ.15,000 పైనే జరుగుతుంది. ఉదాహరణకు ఒక ఉద్యోగి 35 సంవత్సరాలు పనిచేసి ఉంటే, ప్రస్తుత నిబంధనల ప్రకారం అతనికి గరిష్టంగా నెలకు సుమారు రూ.7,500 పెన్షన్ లభిస్తుంది. పెన్షన్ పొందాలంటే కనీసం 10 సంవత్సరాలు పనిచేసి ఉండాలి . 58 ఏళ్లు నిండి ఉండాలి.
కనీస పెన్షన్ పెంపుపై ప్రభుత్వ వైఖరిచాలా కాలంగా కనీస పెన్షన్ మొత్తాన్ని రూ.1,000 నుంచి రూ.7,500కు పెంచాలని పెన్షనర్ల నుంచి డిమాండ్లు ఉన్నాయి. ఈ విషయంపై దాదాపు 69 లక్షల మంది పెన్షనర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే 2025 డిసెంబర్ 1న లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర కార్మిక ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే ఒక క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం పెన్షన్ మొత్తాన్ని పెంచే ప్రతిపాదన పరిశీలనలో లేదని మంత్రి స్పష్టం చేశారు. కొత్త ఫండింగ్ మోడల్ లేకుండా పెన్షన్ మొత్తాన్ని అకస్మాత్తుగా పెంచడం వలన ఫండ్ స్థిరత్వానికి ప్రమాదం ఏర్పడవచ్చు అనేది ప్రభుత్వ వాదన. భవిష్యత్తు బాధ్యతలు, ఆర్థిక సమతుల్యతను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతానికి పెంపు సాధ్యం కాదని ప్రభుత్వం తెలిపింది.