Family Pension : హైకోర్టు సంచలన తీర్పు..పెన్షన్లో భార్యకే మొదటి హక్కు..కొడుకుకు ఇవ్వడం కుదరదు.

Update: 2025-11-26 09:30 GMT

Family Pension : కుటుంబ పెన్షన్‌కు సంబంధించి ఇటీవల అలహాబాద్ హైకోర్టు ఒక సంచలన తీర్పు ఇచ్చింది. ఇది వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబాలకు ఒక ముఖ్యమైన పాఠంగా మారింది. చాలా మంది పెన్షన్ ఎవరికి ఇవ్వాలనేది ఉద్యోగి ఇష్టం అని, తాను ఎవరిని నామినేట్ చేస్తే వారికే పెన్షన్ వస్తుందని అనుకుంటారు. కానీ హైకోర్టు ఆ అభిప్రాయాన్ని ఖండిస్తూ.. ఫ్యామిలీ పెన్షన్ అనేది వీలునామా లేదా దానం కాదు, అది ఒక చట్టబద్ధమైన హక్కు అని స్పష్టం చేసింది.

అసలు కేసు ఏమిటి?

ఈ కేసు ప్రభు నారాయణ్ సింగ్ అనే దివంగత అసిస్టెంట్ టీచర్‌కు సంబంధించినది. ఆయన మరణానంతరం, ఆయన భార్య ఫ్యామిలీ పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే అధికారులు ఆమె దరఖాస్తును తిరస్కరించారు. దానికి కారణం.. ఉద్యోగి తన పెన్షన్ పత్రాలలో భార్య పేరు రాయకుండా, కొడుకు అతుల్ కుమార్ సింగ్‌ను నామినేట్ చేశారు. అప్లికేషన్‌లో భార్య ఫోటో కూడా లేదు. దీనిని సవాల్ చేస్తూ భార్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆమె చట్టబద్ధంగా వివాహం చేసుకున్న భార్య అని నిరూపించడానికి గ్రామ పెద్ద సర్టిఫికెట్‌తో పాటు, 2015లో ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన భరణం ఆర్డర్ (నెలకు రూ.8,000)ను కూడా కోర్టుకు సమర్పించారు.

భార్యకే మొదటి ప్రాధాన్యత

అలహాబాద్ హైకోర్టు ఉత్తరప్రదేశ్ రిటైర్మెంట్ బెనిఫిట్ రూల్స్, 1961 ను, సివిల్ సర్వీస్ రెగ్యులేషన్స్ను క్షుణ్ణంగా పరిశీలించింది. ఈ నియమాల ప్రకారం.. ఫ్యామిలీ పెన్షన్ పొందే వారి జాబితాలో చట్టబద్ధంగా వివాహం చేసుకున్న భార్య/భర్తకే మొదటి ప్రాధాన్యత ఉంటుంది. నియమం 7(4) ప్రకారం.. మరణించిన ఉద్యోగి పురుషుడైతే, పెన్షన్ ముందుగా జీవించి ఉన్న పెద్ద భార్యకే ఇవ్వాలి. ఈ కేసులో కొడుకు అతుల్ కుమార్ సింగ్‌ను నామినేట్ చేసినా తండ్రి మరణించే సమయానికి కొడుకు వయసు దాదాపు 34 ఏళ్లు. చట్టం ప్రకారం కొడుకు నిర్దేశిత వయోపరిమితి, ఆర్థిక ఆధారిత షరతులను పూర్తి చేస్తేనే పెన్షన్ అందుతుంది. 34 ఏళ్ల వయసులో కొడుకు ఈ ప్రమాణాలకు అనర్హుడు అవుతాడు. కోర్టు ఈ సందర్భంగా ఫ్యామిలీ పెన్షన్ అనేది ఉద్యోగి రద్దు చేయలేని చట్టబద్ధమైన హక్కు అని గట్టిగా చెప్పింది.

నామినేషన్ కేవలం ఒక సూచన మాత్రమే

పెన్షన్ దరఖాస్తును తిరస్కరించడానికి అధికారులు నామినేషన్‌ను మాత్రమే ఆధారంగా చేసుకోవడం కూడా తప్పు అని కోర్టు తేల్చి చెప్పింది. రూల్స్ ఉద్యోగి తన కుటుంబ సభ్యులకు మాత్రమే నామినేషన్ ఇవ్వాలి. అయితే నామినేషన్ ఇచ్చినంత మాత్రాన, పెన్షన్ పొందే వారి ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ మారదు. ఆ ప్రాధాన్యత ఎప్పుడూ భార్యకే ఉంటుదని తెలిపింది. భార్య వయసు 62 ఏళ్లు కావడం, ఆమెకు జీవనాధారం లేకపోవడం, గతంలో భరణం కోసం ఫ్యామిలీ కోర్టు ఆర్డర్ ఉండటం ఇవన్నీ ఆమె ఆర్థికంగా ఆధారపడి ఉన్నారని నిరూపించాయి. అందుకే హైకోర్టు వెంటనే భార్యకు ఫ్యామిలీ పెన్షన్ విడుదల చేయాలని అధికారులను ఆదేశిస్తూ, అంతకుముందు ఇచ్చిన తిరస్కరణ ఉత్తర్వును రద్దు చేసింది.

Tags:    

Similar News