US Unemployment : ఉద్యోగాల మోత కాదు.. ఉద్యోగుల కోత: నిరుద్యోగంలో అమెరికా పాత రికార్డులు బద్దలు.

Update: 2025-12-17 06:00 GMT

US Unemployment : ప్రపంచంలో ఒకవైపు భారత్ లాంటి దేశాల్లో నిరుద్యోగిత రేటు గణనీయంగా తగ్గుతున్నా, అమెరికాలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. అమెరికాకు నిరుద్యోగం విషయంలో ఊహించని పెద్ద దెబ్బ తగిలింది. దేశంలో నిరుద్యోగ రేటు ఏకంగా నాలుగు సంవత్సరాల రికార్డును బద్దలు కొట్టింది. నవంబర్ నెల లెక్కల ప్రకారం.. అమెరికాలో నిరుద్యోగ రేటు 4.6 శాతానికి చేరుకుంది. ఇది 2021 సంవత్సరం తర్వాత నమోదైన అత్యధిక స్థాయి కావడం గమనార్హం.

సాధారణంగా నెలనెలా విడుదలయ్యే ఉద్యోగ గణాంకాలను అమెరికా ప్రభుత్వం ఈసారి చాలా ఆలస్యంగా విడుదల చేసింది. 43 రోజుల పాటు ప్రభుత్వ కార్యకలాపాలు నిలిచిపోవడం (షట్‌డౌన్) కారణంగా ఈ ఆలస్యం జరిగింది. కార్మిక శాఖ అక్టోబర్, నవంబర్ నెలలకు సంబంధించిన డేటాను ఒకేసారి విడుదల చేసింది. నవంబర్ నెలలో మొత్తం 64,000 కొత్త ఉద్యోగాలు పెరిగాయి. ఆర్థిక నిపుణుల అంచనా (40,000) కంటే ఈ పెరుగుదల మెరుగ్గా ఉన్నప్పటికీ, మొత్తం నిరుద్యోగ రేటు మాత్రం పెరిగింది. అక్టోబర్ నెలలో మాత్రం ఉద్యోగ కల్పనలో భారీగా కోత పడింది. ఏకంగా 1.05 లక్షల ఉద్యోగాలు తగ్గినట్లు డేటా చెబుతోంది.

అక్టోబర్‌లో ఉద్యోగాలు భారీగా తగ్గడానికి ప్రధాన కారణం ట్రంప్ ప్రభుత్వ హయాంలో చేసిన కోతలు అని తెలుస్తోంది. ఆ నిర్ణయాల కారణంగా ఫెడరల్ ఉద్యోగుల సంఖ్య తగ్గింది. అక్టోబర్‌లో ఒక్క ఫెడరల్ ఉద్యోగుల సంఖ్యలోనే 1,62,000 మంది తగ్గినట్లు కార్మిక శాఖ నివేదిక పేర్కొంది. అంతేకాకుండా, ఆగస్టు, సెప్టెంబర్ నెలలకు సంబంధించిన పేరోల్ డేటాను కూడా ప్రభుత్వం సవరించింది. ఆ రెండు నెలల్లో కలిపి అదనంగా 33,000 ఉద్యోగాలు తగ్గినట్లు తాజా లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.

నిరుద్యోగం పెరిగిందనే వార్తలు, ఉద్యోగ కల్పనలో ఉన్న హెచ్చుతగ్గుల ప్రభావం అమెరికా స్టాక్ మార్కెట్లపై కూడా కనిపించింది. ఈ గణాంకాలు విడుదలైన తర్వాత మార్కెట్లో అమ్మకాలు పెరిగి, సూచీలు పడిపోయాయి. నాస్‌డాక్ 27.14 పాయింట్ల నష్టంతో 23,030.27 వద్ద ట్రేడ్ అయింది. డావ్ జోన్స్లో 0.25 శాతం పతనం కనిపించింది. ఇది 48,293.36 పాయింట్ల వద్ద ముగిసింది. ఎస్ అండ్ పీ 500 సూచీ కూడా 0.29 శాతం క్షీణించి 6,796.60 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది.

మొత్తంగా చూస్తే అమెరికన్ ఆర్థిక వ్యవస్థ ఉద్యోగ కల్పన విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటోందని, ఇది అక్కడి స్టాక్ మార్కెట్లపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతోందని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

Tags:    

Similar News