The Chosen One: షూటింగ్‌లో అనుకోని ప్రమాదం.. ఇద్దరు హీరోలు మృతి..
The Chosen One: తాజాగా బాజా కాలిఫోర్నియా సమీపంలోని ఎడారి ప్రాంతంలో ది చూసెన్ వన్ మూడో సీజన్ షూటింగ్‌ను ప్రారంభించుకుంది.;
The Chosen One: సినిమా షూటింగ్ అన్నప్పుడు మేకర్స్ ఎంతో జాగ్రత్తగా ఉంటారు. ఎంత ప్రమాదకరమైన సీన్‌ను చిత్రీకరించాలన్న తగిన జాగ్రత్తలు తీసుకోకుండా మొదలుపెట్టరు. కానీ ప్రమాదం అనేది ఏ వైపు నుండి ఎలా వస్తుందో.. ఎవరి ప్రాణాలను తీసుకెళ్తుందో ఎవరూ చెప్పలేరు. అలాగే కాలిఫోర్నియాలో ఓ సిరీస్ షూటింగ్ సమయంలో.. అనుకోని ప్రమాదం వల్ల ఇద్దరు హీరోలు తమ ప్రాణాలను కోల్పోయారు.
నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలయ్యే సిరీస్‌లకు సెపరేట్ ఫ్యాన్‌బేస్ ఉంది. అందుకే నెట్‌ఫ్లిక్స్ కూడా ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకోవడానికి హిట్ అయిన సిరీస్‌లకు ఒకటి తర్వాత మరొకటి సీజన్లు రిలీజ్ చేస్తూనే ఉంటుంది. అందులో ఒక సిరీస్ 'ది చూసెన్ వన్'. ఇప్పటికే ఈ సిరీస్ రెండు సీజన్లు నెట్‌ఫ్లిక్స్‌లో మంచి హిట్‌ను అందుకున్నాయి. అందుకే మూడో సీజన్ షూటింగ్‌ను ప్రారంభించింది 'ది చూసెన్ వన్' టీమ్.
తాజాగా బాజా కాలిఫోర్నియా సమీపంలోని శాంటా రోసాలియా ఎడారి ప్రాంతంలో 'ది చూసెన్ వన్' మూడో సీజన్ షూటింగ్‌ను ప్రారంభించుకుంది. అక్కడ భారీ యాక్షన్ సీన్స్ కోసం ఏర్పాటు చేశారు. ఇంతలోనే పక్కనే ఉన్న రోడ్డుపై వెళ్తున్న ఓ వ్యాన్.. పల్టీలు కొడుతూ షూటింగ్ స్పాట్‌లోకి వచ్చింది. అక్కడే ఉన్న హీరోలు రేముండో గుర్డానో, జువాన్ ఫ్రాన్సిస్కో అగ్యిలర్‌పై పడింది. వారితో పాటు మరో ఆరుగురినీ ఈ వ్యాన్ ఢీ కొట్టింది.
అనుకోని ప్రమాదం జరగడంతో టీమ్ అంతా షాక్‌లో ఉండిపోయారు. కాసేపటి తర్వాత చూసేసరికి.. ఆ ఇద్దరు హీరోలు మృత్యువాత పడ్డారు. ఇక మిగిలిన ఆరుగురు గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటన జూన్ 16న చోటుచేసుకోగా.. విషయం బయటపడకుండా నెట్‌ఫ్లిక్స్ యాజమాన్యం, సిరీస్ టీమ్ జాగ్రత్త పడింది. ఇక హీరోల మరణంతో ది చూసెన్ వన్ సిరీస్ షూటింగ్ ఆగిపోయింది.