Actor Vijay
తమిళ స్టార్ హీరో, తలపతి విజయ్ హీరోగా నటిస్తున్న లియో సినిమా కోసం అభిమానులంతా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా వివాదంలో చిక్కుకుంది. ఈ మూవీలోని ఓ పాటపై కోర్టులో కేసు నమోదైంది. సినిమా యూనిట్ ఇటీవల విడుదల చేసిన పాట డ్రగ్స్ వినియోగం, రౌడీయిజాన్ని కీర్తిస్తూ, ప్రోత్సహించేలా ఉందని కేస్ ఫైల్ అయింది. చెన్నైకి చెందిన RTI సెల్వం అనే కార్యకర్త కోర్టుకు వెళ్లాడు.
జూన్ 22న విజయ్ 49వ పుట్టినరోజు సందర్భంగా 'నా రెడీ..' అనే పాటను విడుదలచేశారు మూవీ మేకర్స్. ఈ పాట అభిమానుల్ని ఉర్రూతలూగిస్తోంది. అయితే ఈ పాట మత్తు పదార్థాల వినియోగం, రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తోందని జూన్ 25న ఆన్‌లైన్‌లో సదరు వ్యక్తి ఫిర్యాదు చేశాడు. మరుసటి రోజు జూన్ 26న పిటిషన్ సమర్పించారు. అలాగే చిత్ర యూనిట్‌పై నార్కొటిక్ నియంత్రణా చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరాడు.
చెన్నై నగరంలో మత్తుపదార్థాల నివారణకు పోలీసులు పలు కార్యక్రమాలు, ప్రచారాలు చేపడుతున్నారు. ఈ కార్యక్రమాల్లో నటులు విజయ్, కార్తీ పాలుపంచుకున్నారు.
విక్రమ్ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన లోకేష్-కనగరాజ్ దర్శకత్వంలో వస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమా దసరా సందర్భంగా అక్టోబర్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. హీరో విజయ్, బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్, త్రిష ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. గౌతం వాసుదేవ్ మీనన్, యాక్టింగ్ కింగ్ అర్జున్, మిస్కిన్, మన్సూల్ అలీ ఖాన్, ప్రియా ఆనంద్ వంటి నటీనటులు నటిస్తున్నారు. ఈ సినిమాకి లలిత్ కుమార్, జగదీష్ పళనిస్వామిలు నిర్మాతలుగా ఉన్నారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.