Udhayanidhi Stalin: 'అదే యాక్టర్‌గా నా చివరి చిత్రం'.. యంగ్ హీరో ప్రకటన
Udhayanidhi Stalin: సూపర్ హిట్ బాలీవుడ్ సినిమా ‘ఆర్టికల్ 15’కు తమిళ రీమేక్ అయిన ‘నెంజుకు నీధి’లో నటించాడు ఉదయనిధి.;
Udhayanidhi Stalin: సినిమాల్లో రాణించి తర్వాత రాజకీయాల్లో వెలగాలి అనుకునే నటీనటులు చాలామందే ఉంటారు. సినిమాల నుండి రాజకీయాల్లోకి వెళ్లి మళ్లీ సినిమాలవైపే తిరిగొచ్చిన వారు కూడా ఉన్నారు. కానీ ఓ యంగ్ హీరో మాత్రం తన కెరీర్ ఫామ్‌లోకి రాకముందే సినిమాలు మానేసి రాజకీయాల్లో సెటిల్ అయిపోవాలని నిర్ణయించుకున్నాడు.
తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్ తన తండ్రిలాగా రాజకీయాల్లో సెటిల్ అవ్వాలి అనుకోకుండా సినిమాల్లో రాణించాలి అనుకున్నాడు. ఉదయనిధి హీరోగా నటించిన చాలావరకు సినిమాలు డీసెంట్ హిట్‌ను అందుకున్నాయి కానీ తనకు స్టార్‌డమ్ మాత్రం తెచ్చిపెట్టలేకపోయాయి. అందుకే తిరిగి రాజకీయాల వైపు తన అడుగులు పడ్డాయి.
తమిళనాడులో జరిగిన గత ఎన్నికల్లో ఉదయనిధి స్టాలిన్ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచాడు. అప్పుడే తన సినీ ప్రస్థానం ఆగిపోతుంది అనుకున్నారంతా. కానీ అలా జరగలేదు. ముందు నుండి ఉన్న కమిట్‌మెంట్స్ వల్ల ఉదయనిధి అప్పటికప్పుడు సినిమాలకు దూరమవ్వడం కష్టమయ్యింది. ప్రస్తుతం ఉదయనిధి మూడు సినిమాల్లో హీరోగా నటిస్తున్నాడు.
సూపర్ హిట్ బాలీవుడ్ సినిమా 'ఆర్టికల్ 15'కు తమిళ రీమేక్ అయిన 'నెంజుకు నీధి' అనే చిత్రంలో నటించాడు ఉదయనిధి. ఈ సినిమా మే 20న విడుదల కానుంది. ఇది కాకుండా మారి సెల్వరాజ్ దర్శకత్వంలో 'మామన్నన్' అనే చిత్రం కూడా చేస్తున్నాడు. అయితే మామన్నన్ తర్వాత తను సినిమాలకు గుడ్ బై చెప్పనున్నట్టు ఉదయనిధి స్వయంగా ప్రకటించాడు.