Kangana Ranaut : సందర్శకులు, నియోజకవర్గ ప్రజలు.. ఆధార్ చూపితేనే కంగన దర్శనం
కాంగ్రెస్ నేతలు ఆగ్రహం..;
బాలీవుడ్ నటి, ఇటీవల హిమాచల్ ప్రదేశ్ నుంచి బీజేపీ తరఫున ఎంపీగా ఎన్నికైన కంగనా రనౌత్ తనను కలుసుకోవాలనుకునే సందర్శకులు, నియోజకవర్గ ప్రజలకు కొత్త ఆంక్షలు విధించారు. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని మండి లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా విజయం సాధించిన విషయం తెలిసిందే. పలు వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వివాదాల్లో నిలిచే కంగనా రనౌత్ తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవల ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మండి లోక్‌సభ నియోజకవర్గం ప్రజలు తనను కలవాలనుకుంటే వారి వెంట ఆధార్ కార్డు తప్పనిసరిగా తీసుకురావాలని పేర్కొన్నారు. అలాగే నన్ను ఎందుకు కలవాలనుకుంటున్నారో ఆ కారణాన్ని ఒక పేపర్ పై రాసివ్వాలి. ఈ విధానం వల్ల నియోజకవర్గం నుంచి నన్ను కలిసేందుకు వచ్చిన వారికి అసౌకర్యం ఉండదని కంగనా అన్నారు.
హిమాచల్ ఉత్తర ప్రాంతానికి చెందిన వారు తనను కలవాలనుకుంటే మనాలిలోని తన ఇంటికి రావొచ్చు. మండిలోని వ్యక్తులు నగరంలోని తన కార్యాలయానికి రావొచ్చు. మీ పని విషయంలో మీరు వ్యక్తిగతంగా కలుసుకోవడం మంచిది.. దానికి అనుగుణంగా ముందుగా మీ వివరాలు తెలియజేస్తే బాగుంటుందని కంగనా పేర్కొన్నారు. కంగనా వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు.
కాంగ్రెస్ నేత, హిమాచల్ ప్రదేశ్ మంత్రి విక్రమాదిత్య సింగ్ సోషల్ మీడియాలో కంగనా వ్యాఖ్యలపై స్పందించారు. మమ్మల్ని కలవడానికి ఎవరికీ ఆధార్ కార్డ్ అవసరం లేదు. పనికోసం రాష్ట్రంలోని ఏ మూల నుంచి ఎవరైనా వచ్చి మమ్మల్ని కలవవచ్చు. మేం ప్రజాప్రతినిధులం కాబట్టి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాల ప్రజలను కలవడం మా బాధ్యత. అది చిన్నపని అయినా, పెద్దపని అయినా, విధానపరమైన అంశం అయినా, వ్యక్తిగత పని అయినా.. మమ్మల్ని కలవాలంటే ఆధార్ కార్డు అవసరం లేదని అన్నారు. ఒక వ్యక్తి ప్రజాప్రతినిధి వద్దకు వస్తున్నాడు అంటే ఏదో పనికోసమే వస్తాడు. అలాంటి వారిని మీ ఆధార్ కార్డు వెంట తెచ్చుకోవాలని సూచించడం సరికాదని విక్రమాదిత్య సింగ్ పేర్కొన్నారు