Budget 2022: కోవిడ్ సంక్షోభం మొదలైన తర్వాత రెండోసారి బడ్జెట్..
Budget 2022: కొవిడ్ సంక్షోభం మొదలైన తర్వాత రెండో బడ్జెట్ ప్రవేశపెట్టడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది.;
Budget 2022: కొవిడ్ సంక్షోభం మొదలైన తర్వాత రెండో బడ్జెట్ ప్రవేశపెట్టడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై అంచనాలతో దేశమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. ఈసారి ఏయే రంగాలకు సర్కార్ ప్రాధాన్యం ఇవ్వనుంది? అనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈనెల 31 నుంచి ప్రారంభంకానున్న పార్లమెంట్ సమావేశాలు.. రెండు విడతల్లో నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది.
తొలి విడత సమావేశాలు ఫిబ్రవరి 11తో ముగుస్తాయి. రెండో విడత సమావేశాలు మార్చి 11 నుంచి మొదలై.. ఏప్రిల్ 8 వరకు కొనసాగనున్నాయి. తొలి విడతలోనే వచ్చే నెల 1న ఉదయం 11 గంటలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్... 2022-23 బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అయితే కరోనా వ్యాప్తితో ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న తరుణంలో ఈ బడ్జెట్ ఏవిధంగా ఉండబోతుందోనని అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
బడ్జెట్ 2022-23పై అన్ని వర్గాల నుంచి డిమాండ్‌లు బలంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా చతికిలపడ్డ ఆర్థిక రంగాన్ని పరుగులెత్తించడానికి, కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకోవాలని అన్ని రంగాలవారు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకులకు కేంద్రం మూలధన సాయం ప్రకటించకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
బ్యాంకుల మొండి బకాయిలు తగ్గడం, ఆర్థిక పరిస్థితి మెరుగవ్వడంతో వాటికి సాయం అక్కర్లేదని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. నిధులు అవసరమైన బ్యాంకులు మార్కెట్ నుంచి గానీ లేదంటే ప్రధానేతర ఆస్తులను విక్రయించడం ద్వారా గానీ సమీకరించుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తుందని సమాచారం. రుణమాఫీపైనా రైతులు గంపెడు ఆశలతో ఉన్నారు.
వచ్చే ఆర్థిక సంవత్సరం 2022-23కి రుణ వితరణ లక్ష్యాన్ని 18 లక్షల కోట్లుగా కేంద్రం నిర్దేశించే అవకాశం ఉందని అంచనా. దేశంలో ఎక్కువగా చిన్న, సన్నకారు రైతులే ఉండడంతో వారికి అందే రుణమొత్తం కూడా తక్కువే. కేంద్రం తక్కువ వడ్డీతో దీర్ఘకాల రుణాలను అందించగలిగితే.. యాంత్రీకరణ, గిడ్డంగులు, షెడ్ల నిర్మాణం వంటి పనులు చేపట్టేందుకు అన్నదాతకు వెసులుబాటు ఉంటుంది. ఆ దిశగా బడ్జెట్ ప్రతిపాదనలు ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
అటు ఈ సారి బడ్జెట్ లో టూ వీలర్ల ధరలు తగ్గు ముఖం పట్టే అవకాశం కనిపిస్తోంది. మఖ్యంగా ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ డిమాండ్లను ప్రభుత్వం అంగీకరిస్తే, బడ్జెట్ తర్వాత ద్విచక్ర వాహనాల ధరలు తగ్గే అవకాశం ఉంది. వీటిపై జీఎస్టీ రేట్లను 18 శాతానికి తగ్గించాలని ఆటోమొబైల్ డీలర్ల సంస్థ FADA కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ ద్విచక్ర వాహనాలు విలాసవంతమైన ఉత్పత్తి కాదని, అందువల్ల జీఎస్టీ రేట్లను తగ్గించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఇక వేతన జీవులకు కేంద్ర ప్రభుత్వం స్టాండర్డ్ డిడక్షన్ లిమిట్‌ను పెంచే అవకాశాలున్నాయి. ప్రస్తుతం స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి 50 వేలుగా ఉంది. దీన్ని 30 నుంచి 35 శాతానికి పెంచొచ్చనే అంచనాలున్నాయి.
ఈ బడ్జెట్‌లో ఈ అంశానికి సంబంధించి ప్రకటన చేసే అవకాశముంది. స్టాండర్డ్ డిడక్షన్ లిమిట్ పెంచాలని చాలా కాలం నుంచే డిమాండ్ ఉంది. అయితే ప్రభుత్వం మాత్రం ఈ అంశాన్ని దాటవేస్తూ వస్తోంది. అయితే ఈసారి కోవిడ్ 19 నేపథ్యంలో వైద్య ఖర్చులు పెరిగాయి. దీంతో మోదీ సర్కార్ కూడా ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.
అందుకే స్టాండర్డ్ డిడక్షన్ లిమిట్ పెంచాలని కోరుతున్నాయి. అయితే తాజా పన్ను వసూళ్ల అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకొని ఒక నిర్ణయానికి వచ్చే ఛాన్స్ ఉంది. వర్క్ ఫ్రం హోమ్ వల్ల ఎలక్ట్రిసిటీ బిల్లు, ఇంటర్నెట్ బిల్లు వంటివి పెరిగాయి. ఈ అంశాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలని పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి.
ఈసారి బడ్జెట్‌ను కాగిత రహితంగా ప్రవేశపెట్టనున్నా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. అందరికీ కేంద్ర బడ్జెట్ సమాచారాన్ని సులభంగా, త్వరగా అందుబాటులో ఉంచడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం యూనియన్ బడ్జెట్ మొబైల్ యాప్ రూపొందించారు. ఈ యాప్ ఇంగ్లీష్, హిందీ భాషల్లో అందుబాటులో ఉంటుంది.
బడ్జెట్‌ను గోప్యంగా ఉంచడం కోసం కొందరు ముఖ్యమైన సిబ్బందిని ఆర్థికశాఖ కార్యాలయంలోని బడ్జెట్ ప్రెస్‌లో ఉంచారు. బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టిన తర్వాత యాప్ ద్వారా అందుబాటులోకి వస్తుందని ఆర్థికశాఖ తెలిపింది. కరోనా మహమ్మారి, ఆరోగ్య భద్రత సమస్యల కారణంగా హల్వా వేడుకకు బదులుగా ప్రధాన ఉద్యోగులకు స్వీట్లు అందించారు.