ప్రజ్వల్ రేవణ్ణ పాస్‌పోర్ట్‌ను రద్దు చేయండి.. ప్రధానిని అభ్యర్థించిన సీఎం
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కర్ణాటక సెక్స్ స్కాండల్ ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీకి రెండో లేఖ రాశారు.
మే 22 నాటి ప్రధాన మంత్రికి రాసిన లేఖలో,"ఏప్రిల్ 27 న తన దౌత్యపరమైన పాస్‌పోర్ట్‌ను ఉపయోగించి దేశం విడిచిపెట్టాడు" అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. గత నెలలో సెక్స్ స్కాండల్ వెలుగులోకి వచ్చిన తర్వాత పరారీలో ఉన్న హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ దౌత్య పాస్‌పోర్ట్‌ను రద్దు చేయాలని ప్రధానిని కోరారు సిద్ధ రామయ్య.
రేవణ్ణ దౌత్య పాస్‌పోర్ట్‌ను రద్దు చేయాలంటూ కర్ణాటక ప్రభుత్వం చేసిన అభ్యర్థనను ఇప్పుడు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రాసెస్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభ్యర్థన, ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో జర్మనీకి పారిపోయిన ఎంపీపై వచ్చిన ఆరోపణలను పరిష్కరించే దిశగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
సీఎం ప్రధానికి రాసిన లేఖలో ప్రజ్వల్ పై మొదటి ఎఫ్‌ఐఆర్ దాఖలయ్యే కొద్ది గంటల ముందు తన హేయమైన చర్యల గురించి వార్తలు వెలువడటం సిగ్గుచేటు" అని అన్నారు. "అతడు దేశం నుండి పారిపోవడానికి, క్రిమినల్ ప్రొసీడింగ్స్ నుండి తప్పించుకోవడానికి తన దౌత్యపరమైన అధికారాలను దుర్వినియోగం చేశాడని లేఖలో పేర్కొన్నారు.
జనతాదళ్ (సెక్యులర్) నాయకుడు ౩౩ ఏళ్ల ప్రజ్వల్ రేవణ్ణ మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపించిన అనేక వీడియోలు కర్ణాటకలో హల్ చల్ చేశాయి. లోక్‌సభ ఎన్నికల మొదటి దశకు ముందు ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ చేయబడింది.
ఈ వీడియోలు మార్ఫింగ్ చేసినవేనని జేడీ(ఎస్)-బీజేపీ ఉమ్మడి అభ్యర్థి రేవణ్ణ పేర్కొన్నారు. కానీ అతను అత్యాచారం, వేధింపులు, బెదిరింపు, బ్లాక్‌మెయిలింగ్ , బెదిరింపు ఆరోపణలను ఎదుర్కొంటున్నాడు. ఇంటర్‌పోల్ అతనిపై బ్లూ కార్నర్ నోటీసు జారీ చేసింది.
ఇదిలావుండగా, ఈ అంశంపై దర్యాప్తు చేయడానికి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేయడం ద్వారా న్యాయం జరిగేలా తమ రాష్ట్ర ప్రభుత్వం సత్వర చర్యలు చేపట్టిందని సిద్ధరామయ్య లేఖలో పేర్కొన్నారు.
"మహిళలపై ప్రజ్వల్ రేవణ్ణ ఆరోపించిన నేరాలపై సిట్ దర్యాప్తు చేస్తోంది. నిందితుడు ప్రజ్వల్ రేవణ్ణ ఈ విషయంలో అజ్ఞాతంలో ఉండటం తీవ్ర ఆందోళన కలిగించే విషయం. లుక్ అవుట్ సర్క్యులర్, బ్లూ కార్నర్ నోటీసు మరియు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ రెండు నోటీసులు జారీ చేసినప్పటికీ అతడు ఏ మాత్రం చలించట్లేదని సిద్ధరామయ్య లేఖలో పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి ఇంకా మాట్లాడుతూ, "ఈ సమస్యపై ఇలాంటి ఆందోళనలను లేవనెత్తుతూ నేను గతంలో రాసిన లేఖ, పరిస్థితి తీవ్రతరం అయినప్పటికీ, నాకు తెలిసినంతవరకు, చర్య తీసుకోకపోవడం నిరుత్సాహపరుస్తుంది" అని అన్నారు.