Coldrif Syrup: కోల్డ్రిఫ్ సిరప్ మరణాల కేసు.. శ్రేసన్ ఫార్మా ఓనర్ అరెస్ట్..
20 మంది చిన్నారులను బలిగొన్న దగ్గు సిరప్
దగ్గు మందుతో చిన్నారుల మరణాల ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. మధ్యప్రదేశ్‌లో ‘కోల్డ్‌రిఫ్’ దగ్గుమందు కారణంగా పలువురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం స్పందించింది. తాజాగా ప్రాణాంతకమైన “కోల్డ్రిఫ్” దగ్గు సిరప్ కేసులో మధ్యప్రదేశ్ పోలీసులు పెద్ద పురోగతిని సాధించారు. SRESAN MEDICALS యజమాని రంగనాథన్‌ను అదుపులోకి తీసుకున్నారు. కలుషితమైన కోల్డ్రిఫ్ దగ్గు సిరప్ తాగి 20 మంది పిల్లలు మరణించిన విషయం తెలిసిందే. ఈ కేసులో రంగనాథన్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రశ్నిస్తున్నారు. కేసు తీవ్రతను కేసును దృష్టిలో ఉంచుకుని, శ్రీసాన్ ఫార్మాస్యూటికల్ కంపెనీ యజమానులపై మధ్యప్రదేశ్ పోలీసులు గతంలో బహుమతిని ప్రకటించారు. నిందితుడిని పట్టించిన వారికి రూ. 20,000 నగదు అందిస్తామని ప్రకటన ఇచ్చారు. దీనితో పాటు.. పరారీలో ఉన్న కంపెనీ యజమానులను వెంటనే అరెస్టు చేయడానికి SIT బృందాన్ని సైతం ఏర్పాటు చేశారు. ఈ చర్యల ఫలితంగా రంగనాథన్ అరెస్టు జరిగింది.
కాగా.. ఈ అంశంపై మధ్యప్రదేశ్ ఆరోగ్య శాఖ సహాయ మంత్రి నరేంద్ర శివాజీ పటేల్ బుధవారం మాట్లాడారు. కలుషితమైన దగ్గు సిరప్ సేవించి రాష్ట్రంలో 20 మంది పిల్లలు మరణించారని, ఈ తీవ్ర నిర్లక్ష్యానికి తమిళనాడు ప్రభుత్వమే కారణమని అన్నారు. “రాష్ట్రం నుంచి రవాణా చేసే మందులను పరీక్షించడం తమిళనాడు ప్రభుత్వ బాధ్యత. మధ్యప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోకి వచ్చే మందులను యాదృచ్ఛికంగా పరీక్షలు నిర్వహిస్తుంది, కానీ ఆ ఈ సిరప్‌ను పరీక్షించలేదు” అని పటేల్ అన్నారు.