LPG cylinder: వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర పెంపు..
19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ రేటు రూ.48కి పెంపు;
వంటగ్యాస్ ధర మళ్లీ పెరిగింది. హోటళ్లు, రెస్టారెంట్లలో వినియోగించే 19 కిలోల కమర్షియల్ సిలిండర్‌పై రూ.48.5 పెరిగింది. వరుసగా గత మూడు నెలల నుంచి వాణిజ్య సిలిండర్ ధర పెరుగుతూ వస్తున్నది. మొత్తం ఈ మూడు నెలల్లో రూ.94 మేర పెరిగింది. గృహ అవసరాలకు వాడే గ్యాస్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు. మరోవైపు, విమాన ఇంధన ధర 6 శాతం తగ్గింది. కిలోలీటరకు రూ.5,883 మేర చమురు కంపెనీలు తగ్గించాయి.
దసరా పండుగ వేళ వాణిజ్య గ్యాస్ వినియోగదారులకు చమురు మార్కెటింగ్ కంపెనీలు షాక్ ఇచ్చాయి. అక్టోబర్ 1న భారీగా ధర పెంచింది. 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ రేటును రూ.48కి పెంచింది. పెంచిన ధరలు మంగళవారం (అక్టోబర్ 1) నుంచే అమల్లోకి వస్తాయని స్పష్టం చేశాయి.
ఇదిలా ఉంటే గృహ వినియోగ సిలిండర్ ధరలో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు. 14.2 కేజీల సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదని, పాత ధరలే యథాతథంగా కొనసాగుతాయని చమురు కంపెనీలు స్పష్టం చేశాయి. ప్రతి నెల 1వ తేదీన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ధరలను సవరిస్తుంటాయి. అందులో భాగంగానే అక్టోబర్ 1న సవరించిన ధరలను ప్రకటించాయి.
తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో కమర్షియల్ గ్యాస్ ధర రూ.1691 నుంచి రూ.1740కి పెరిగింది. కోల్‌కతాలో రూ.1802 నుంచి రూ.1850.50కి, ముంబైలో రూ.1644 నుంచి రూ.1692.50కి, చెన్నైలో రూ.1855 నుంచి రూ.1903కి పెరిగాయి. 5-కిలోల ఫ్రీ ట్రేడ్ ఎల్‌పీజీ సిలిండర్‌ల ధర రూ.12 పెంచబడింది.