రాజస్థాన్‌లోని బన్‌స్వారా లోక్‌సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి వింత అనుభవం ఎదురైంది. సొంత అభ్యర్థికి ఓటు వేయొద్దని కోరాల్సిన పరిస్థితి నెలకొంది. దీనికి కారణం భారత్ ఆదివాసీ పార్టీకి కాంగ్రెస్ మద్దతివ్వడమే. ముందుగా కాంగ్రెస్ ఈ స్థానం నుంచి అరవింద్ దామోర్‌ను అభ్యర్థిగా ప్రకటించింది. అయితే ఆ తర్వాత భారత్ ఆదివాసీ పార్టీతో పొత్తు కుదరడంతో దామోర్‌ను నామినేషన్ విత్ డ్రా చేసుకోవాలని కోరింది.
అదే సమయంలో దామోర్ తెలిసి తెలియనట్లుగా వ్యవహరించారు. ఈ క్రమంలో విత్‌డ్రా గడువు ముగియడంతో ఇక్కడ త్రిముఖ పోరు నెలకొంది. దీంతో స్థానిక నేతలు అంతా కాంగ్రెస్ మద్దతు ఇస్తున్న భారత్ ఆదివాసీ పార్టీఅభ్యర్థి రాజ్ కుమార్‌కి ఓటెయ్యాలని ప్రచారం చేస్తున్నారు. మరోవైపు భారత్ ఆదివాసీ పార్టీ వ్యతిరేక గళాలను దామోర్ తనకు అనుకూలంగా పోగేస్తున్నారు. అయితే ఈ వ్యవహారం బీజేపీకి ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.