Chidambaram Controversy: ఆపరేషన్ బ్లూస్టార్ ఓ పొరపాటు-చిదంబరం సంచలన వ్యాఖ్యలు
కాంగ్రెస్ తీవ్ర అసంతృప్తి!
ఆపరేషన్ బ్లూ స్టార్‌పై మాజీ హోంమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పి.చిదంబరం చేసిన వ్యాఖ్యలు సొంత పార్టీ ఆగ్రహానికి గురి చేశాయి. ఆయన వ్యా్ఖ్యలను చాలా మంది కాంగ్రెస్ నాయకులు తప్పుపట్టారు. చిదంబరం ప్రకటనపై కాంగ్రెస్ నాయకుడు రషీద్ అల్వి స్పందిస్తూ .. “ఆపరేషన్ బ్లూ స్టార్ సరైనదా కాదా అనేది వేరే విషయం. కానీ 50 ఏళ్ల తరువాత పి.చిదంబరం ఆపరేషన్ బ్లూ స్టార్‌కు ఆదేశించి.. మాజీ ప్రధాని ఇందిరా గాంధీపై తప్పు చర్య తీసుకున్నారని ఎందుకు చెప్పుకోవాలి” అని ప్రశ్నించారు.
చిదంబరం ఏమన్నారంటే..
కసౌలిలో జరిగిన ఒక సాహిత్య ఉత్సవంలో చిదంబరం మాట్లాడుతూ.. 1984లో ఆపరేషన్ బ్లూ స్టార్‌ను పంజాబ్‌లోని స్వర్ణ దేవాలయంపై జరిగిన తప్పుడు ఆపరేషన్‌గా అభివర్ణించారు. ఈ నిర్ణయానికి మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని చెప్పారు. “నేను ఏ సైనిక అధికారిని అగౌరవపరచడం లేదు, కానీ స్వర్ణ దేవాలయాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ఇది తప్పు మార్గం. కొన్నేళ్ల తరువాత, సైన్యాన్ని దూరంగా ఉంచడం ద్వారా దానిని తీసుకోవడానికి సరైన మార్గాన్ని మేము సూచించాము. బ్లూ స్టార్ తప్పుడు మార్గం, ఇందిరా గాంధీ ఆ తప్పుకు తన ప్రాణాలతో మూల్యం చెల్లించుకున్నారని నేను నమ్ముతున్నాను” అని అన్నారు.
బీజేపీ, ప్రధానమంత్రి చేసినట్లే చిదంబరం కూడా కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తున్నానని రషీద్ అల్వి అన్నారు. కాంగ్రెస్ పార్టీపై చిదంబరం పదే పదే చేస్తున్న దాడులు అనేక సందేహాలను, భయాలను రేకెత్తిస్తుండటం దురదృష్టకరం అని చెప్పారు. ఆయనపై ఇంకా క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని అల్వి ఎత్తి చూపారు. “కాంగ్రెస్ పార్టీపై దాడి చేయడం కొనసాగించడానికి ఆయనపై ఏదైనా ఒత్తిడి ఉందా అని ఆశ్చర్యపోతున్నాను? బ్లూ స్టార్‌కు ఇందిరా గాంధీ కారణమని, దాని కోసం తన జీవితాన్ని త్యాగం చేయాల్సి వచ్చిందని నేడు చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? గత 11 ఏళ్లుగా బీజేపీ లోపాలను బహిర్గతం చేయడానికి బదులుగా చిదంబరం ఇలా ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. బీజేపీ మొత్తం దేశాన్ని ఎలా నాశనం చేస్తుందో వివరించడానికి బదులుగా, ఆయన కాంగ్రెస్ పార్టీ లోపాలను ఎత్తి చూపుతున్నారు” అని విమర్శించారు.