Delhi Airport : ఎయిర్ పోర్టు పైకప్పుపై వివాదం.. మోడీ ప్రారంభించింది కాదన్న మంత్రి రామ్మోహన్
ఢిల్లీ విమానాశ్రయంలోని టెర్మినల్ 1 వద్ద పైకప్పు కూలిపోవడంతో ఒకరు మృతి చెందగా, ఆరుగురు గాయపడ్డారు. పౌర విమానయాన శాఖ మంత్రి ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఇది చాలా తీవ్రమైన ఘటన అని ఆయన వ్యాఖ్యానించారు. కూలిన టర్మినల్ పైకప్పు 2008-09 కాలంలో నిర్మించబడిందని మంత్రి రామ్మోహన్ నాయుడు ( RamMohan Naidu ) తెలిపారు.
ఈ ఏడాది మార్చిలో ప్రధాని నరేంద్ర మోదీ ( Narendra Modi ) ప్రారంభించిన ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం విస్తరించిన టెర్మినల్ 1లో భాగమే కూలిపోయిందని కాంగ్రెస్ ఆరోపించడంతో రామ్మోహన్ నాయుడు రియాక్టయ్యారు. ఢిల్లీ విమానాశ్రయంలో పరిస్థితిని పరిశీలించిన రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. 'ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన భవనం మరొక వైపు ఉందని, ఇక్కడ కూలిపోయిన భవనం పాత భవనమని, 2009 లో ప్రారంభించబడింది" అని స్పష్టం చేశారు.
శుక్రవారం ఢిల్లీ విమానాశ్రయంలోని టెర్మినల్-1 పైకప్పులో కొంత భాగం కూలిపోవడంతో వాహనాలు నుజ్జునుజ్జయ్యాయి. గత 24 గంటల్లో ఢిల్లీలో జూన్లో అత్యధిక వర్షపాతం నమోదవడంతో ఢిల్లీలో 228.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.