Delhi: వెహికల్ రూల్స్‌పై సుప్రీంకోర్టుకు వెళ్లాలని ఢిల్లీ సర్కార్ నిర్ణయం

ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరిస్తామన్న సీఎం రేఖా గుప్తా;

Update: 2025-07-07 04:30 GMT

దేశ రాజధాని ఢిల్లీలో వాహనాల నిబంధనల విషయంలో దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని ఢిల్లీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో కాలుష్యాన్ని తగ్గించేందుకు గతంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. 2018లో 10 సంవత్సరాలు దాటిన డీజిల్ వాహనాలు, 15 సంవత్సరాలు దాటిన పెట్రోల్ వాహనాలను సుప్రీం ధర్మాసనం నిషేధించింది. దీంతో చాలా మంది వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇది ప్రభుత్వం దృష్టికి రావడంతో న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలపై రివ్యూ పిటిషన్ వేసేందుకు రేఖా గుప్తా ప్రభుత్వం సిద్ధపడుతోంది.

కాలుష్య నియంత్రణ కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సుప్రీంకోర్టులో వినిపిస్తామని ఢిల్లీ సీఎం రేఖా గుప్తా అన్నారు. వాహనాల విషయంలో దేశవ్యాప్తంగా వర్తించే రూల్సే ఢిల్లీలో కూడా అమలవ్వాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ ప్రజలు అసౌకర్యానికి గురి కావడం భావ్యం కాదన్నారు. ఇప్పటికే కాలుష్యాన్ని నియంత్రించేందుకు అనేక చర్యలు చేపట్టినట్లు గుర్తుచేశారు. ఇదే విషయాన్ని ధర్మాసనానికి తెలియజేస్తామని చెప్పారు. ఈ మేరకు లెఫ్టినెంట్ గవర్నర్ కూడా సుప్రీంకోర్టులో సమీక్ష పిటిషన్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న పద్ధతులనే ఢిల్లీలో అమలు చేయాలని కోరుతున్నారు.

Tags:    

Similar News