వరుస భూకంపాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా అస్సాంలోని మోరిగావ్ జిల్లాలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 5 మ్యాగ్నిట్యూడ్‌గా నమోదైంది. తెల్లవారుజామున 2.25 గంటలకు భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. కాగా మంగళవారం కోల్‌కతా, ఒడిశాలోని భువనేశ్వర్ సమీపంలోని బంగాళాఖాతంలో, బుధవారం ఇండోనేషియాలోని సులవేసి ప్రావిన్స్‌లో భూకంపం వచ్చింది. అస్సాంలో అర్ద్రరాత్రి చోటు చేసుకున్న భూకంపంతో మోరిగావ్ ప్రజలు ఆందోళనకు గురయ్యారు. 2.25 గంటలకు ఈ భూకంపం చోటు చేసుకుంది. నిద్ర సమయంలో చోటు చేసుకున్న ప్రకంపన లతో ఒక్క సారిగా కలత చెందారు. ప్రకంపనలతో వారంతా రోడ్ల పైకి చేరుకున్నారు. రాత్రి నుంచి ఆరుబయటే గడుపుతున్నారు. ఇప్పటి వరకు ప్రాణ, ఆస్తి నష్టం పైన అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. కొద్ది రోజుల క్రితమే అస్సాంలో బ్రహ్మపుత్ర నది ఉత్తర ఒడ్డున ఉన్న ఉదల్గురి జిల్లాలో భూకంపం చోటు చేసుకుంది. తాజా భూకంపం పైన నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ అధ్యయనం చేస్తోంది.